‘కొండ’త సమస్య

29 Sep, 2018 12:00 IST|Sakshi
కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘కారు’ స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు జట్టు కట్టిన మహాకూటమికి ‘కొండ’​ అంత సమస్య  వచ్చింది.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీట్ల సర్దుబాటు అత్యంత జటిలంగా మారింది.  పొత్తుల్లో భాగంగా టీడీపీకి అడుగుతున్న నర్సంపేట, పరకాల సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీగా తెగేటట్లు లేదు. ఈ రెండు సీట్లు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీకి అత్యంత కీలకంగా మారాయి. ఇరు పార్టీలకు ఇక్కడ కొంత సంస్థాగతమైన బలం ఉండడం, కీలక నేతలే ఇక్కడ పోటీకి ఉవ్విళ్లూరుతుండడంతో పంపకాల సమస్య సంక్షిష్టంగా మారింది.

ఉమ్మడి వరంగల్‌లో టీడీపీకి ఒక్క సీటే...
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జతకట్టిన  తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. గెలిచే అవకాశం ఉన్న సీట్లను మాత్రమే అడిగి తీసుకోవాలని కూటమి పార్టీలన్నీ ఒక మౌఖిక అంగీకారానికి వచ్చాయి. ఈనేపథ్యంలో మిత్రపక్ష పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను కాంగ్రెస్‌ పార్టీకి అందజేశాయి. తెలుగుదేశం 19, టీజేఎస్‌ 25, సీపీఐ 12 సీట్లను కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇందులో టీడీపీకి 15 సీట్లు, టీజేఎస్, సీపీఐ పార్టీలకు మూడేసి సీట్ల చొప్పన ఇచ్చేం దుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం యూనిట్‌గా సీట్ల పంపకాలు ఉంటుండడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే మిత్రపక్షాలకు వదిలేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్క సీటు ఎవరికి అనేది సుస్పష్టమే కానీ.. ఎక్కడ  ఇవ్వాలో తెలియక ఉత్కంఠత నెలకొని ఉంది.

ఇక్కడే పీటముడి...
పరకాల, భూపాలపల్లి, నర్సంపేట,  నియోజకవర్గాలు తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోంది. జిల్లాలో ఒక సీటు ఇచ్చేందుకు  కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఒకే ఒక్క సీటు ఇస్తే అది కచ్చితంగా నర్సంపేట ఇవ్వాలని  టీడీపీ పట్టుబడుతోంది. ఆ ఒక్క సీటు కూడా  టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డికి టీడీపీ ఇచ్చే యోచనలో ఉంది. గతంలో ఆయన ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  అయితే ఈ నియోజకర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఉండడంతో అది సాధం కాదని ఆ పార్టీ నేతలు కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో  ఇండిపెండెంటుగా నిలబడి సత్తా చాటారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రలోభాలకు, ఇబ్బందులకు తట్టుకుని నిలబడ్డారు.  ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా ఉండలేమని కాంగ్రెస్‌ పార్టీ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
 
పరకాల కోసం కొండా దంపతుల ఆసక్తి..
ప్రకాష్‌రెడ్డి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్వయంగా చంద్రబాబే  కల్పించుకుని రేవూరిని గెలిపించే విధంగా సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగాపరకాల నియోజకవర్గాన్ని రేవూరి ప్రకాష్‌రెడ్డికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.  ప్రకాష్‌రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. చివరకు పరకాల నుంచైనా తాను పోటీకి సిద్ధమే అని చెప్పినట్టు తెలిసింది.  ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి సొంత గూటికి చేరిన కొండా సురేఖ, మురళి దంపతులు మొదటి నుంచీ పరకాల, వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. ఇందులో కనీసం రెండు సీట్లు అడుగుతున్నారు. ఒక వేళ ఒక సీటు ఇస్తే పరకాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ముందు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అప్పుడు రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే అనే సందిగ్ధత నెలకొని ఉంది.

మరిన్ని వార్తలు