రూ.13.43 లక్షలు పట్టివేత

3 Nov, 2018 12:49 IST|Sakshi
నగదు పట్టుబడిన వాహనం వద్ద డీఎస్పీ శిరీష రాఘవేందర్, తహసీల్దార్, పోలీస్‌ సిబ్బంది నగదును చూపుతున్న తహసీల్దార్, సీఐ

వికారాబాద్‌ అర్బన్‌: ఎన్నికల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం వికారాబాద్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా రూ. 13.43 లక్షలు పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళితే.. షాబాద్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి కారులో హైదరాబాద్‌ నుంచి తాండూరు వస్తున్నాడు. అదే సమయంలో వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివారెడ్డిపేట్‌ వద్ద సీఐ సీతయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి కారు తనిఖీ చేయగా అందులో రూ.13.43 లక్షలు లభ్యమయ్యాయి.

నగదుకు సంబంధించి సంబంధిత కారు యజమాని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ డబ్బును సీజ్‌ చేశారు. విషయాన్ని సీఐ సీతయ్య ఉన్నతాధికారులకు చెప్పడంతో డీఎస్పీ శిరీష రాఘవేందర్‌ ఘటనా స్థలానికి వచ్చి వాహనాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు నగదును వికారాబాద్‌ తహసీల్దార్‌ చిన్న అప్పలనాయుడుకు అప్పగించారు. సీజ్‌ చేసిన నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని తహసీల్దార్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.16.48లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 60లక్షలు విలువచేసే బంగారం, వెండి ఆభరణాలు సైతం తనిఖీల్లో పట్టుబడ్డాయి.
  
అడుగడుగునా నిఘా.. 
ఎన్నికల సందర్భంగా అక్రమ డబ్బు, మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న ప్రతి ప్రైవేటు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రూ.50వేలకు మించి నగదును తరలిస్తే డబ్బుకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపిస్తే వదిలేస్తున్నారు. లేనిపక్షంలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రత్యేక తనిఖీల కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇటీవల కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఈ బృందంలో ఎగ్జిక్యూటీవ్‌ మెజిస్ట్రేట్‌ అధికారితో పాటు పోలీస్, రెవెన్యూ అధికారి, వీడియో తీసేందుకు వీడియో గ్రాఫర్‌ ఉంటారు. ఈ బృందాలకు ఇచ్చే వాహనాలకు పూర్తిగా జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనికి తోడు పాత నేరస్తులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. వారందరినీ తీసుకొచ్చి తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు