నేడు జిల్లాకు కేసీఆర్‌ 

3 Dec, 2018 08:50 IST|Sakshi
సత్తుపల్లిలో సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు విడతలుగా పర్యటిం చి పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలను పూర్తిచేసిన కేసీఆర్‌ మూడో విడతగా జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల కు సత్తుపల్లిలో, ఒంటిగంటకు మధిరలో జరి గే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ రెండు స్థానాలను టీఆర్‌ఎస్‌ ఆదినుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ పతాకాన్ని ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు చెమటోడుస్తున్నాయి.

మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లింగాల కమల్‌రాజు గెలుపుకోసం ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత రెండు నెలలుగా శ్రమిస్తున్నారు. తానే పార్టీ అభ్యర్థి అన్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ పూర్తిగా మధిర నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పోటీ చేస్తుండటంతో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా భావించి విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మధిర అభ్యర్థి విజయం కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో పల్లెనిద్రలు సైతం చేశారు.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ టీఆర్‌ఎస్‌ పార్టీకి మరింత లాభిస్తుందన్న అంచనాలతో పార్టీ శ్రేణులు సభ విజయవంతానికి దృష్టి సారించాయి. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష సైతం మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి లింగాల కమల్‌రాజ్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మధిర నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత కొండబాల కోటేశ్వరరావు గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేయడంతో పలు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పిడమర్తి రవి పోటీ చేస్తుండటంతో..ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమించాలని స్వయంగా కేసీఆర్‌ గతంలో పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించి మరీ చెప్పారు. దీంతో కేసీఆర్‌ సభను విజయవంతం చేసే బాధ్యతను పార్టీ నేతలు భుజానికెత్తుకున్నారు. డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు..పిడమర్తి రవి విజయం కోసం పూర్తిగా సత్తుపల్లిలోనే మకాం వేసి శ్రేణులను సమన్వయ పరుస్తున్నారు. 

గతంలో సత్తుపల్లి శాసనసభ్యుడిగా అనేక పర్యాయాలు పనిచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి సైతం పిడమర్తి విజయం కోసం సత్తుపల్లిలో మకాం వేశారు.

ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రజాకూటమి తరఫున సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో పాటు సత్తుపల్లి, మధిర సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు పాల్గొననున్నారు. సత్తుపల్లిలో సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవరా>్గలు కలిపి సభను నిర్వహిస్తుండగా, మధిరలో వైరా, మధిర నియోజకవర్గాలను కలిపి ఈ ఎన్నికల ప్రచార సభ జరగనుంది.

మరిన్ని వార్తలు