ఎన్నికలకు సిద్ధం

25 Sep, 2018 12:54 IST|Sakshi
కలెక్టర్‌ ధర్మారెడి

సాక్షి, మెదక్‌: ‘ఎన్నికల నిర్వహణ ప్రతి అధికారికి సవాలే.  తహసీల్దార్‌గా మొదలు వివిధ హోదాల్లో పలు ఎన్నికల నిర్వహణలో పనిచేశాను. 1998లో మచిలీపట్నంలో మొదటి సారిగా తహసీల్దార్‌ హోదాలో ఎన్నికల అధికారిగా పనిచేయడం ఎన్నటికీ మరువలేను. మచిలీపట్నం చాలా పెద్ద మండలం. పోలింగ్‌కు ఒకరోజు ముందు భారీ వర్షం కురిసింది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించటం ఎంతో సంతృప్తినిచ్చింది. అప్పటి కలెక్టర్‌ ప్రార్థసారథి నన్ను ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత ఆర్డీఓ, జేసీ హోదాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించాను. ప్రస్తుతం కలెక్టర్‌ హోదాలో ఎన్నికల విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని కలెక్టర్‌ ధర్మారెడి అన్నారు. ‘సాక్షి’తో ఆయన జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేకంగా మాట్లాడారు.  మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేక దృష్టి 
ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా కీలకమైంది. ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మంగళవారంతో ఓటరు జాబితా సవరణ సమయం పూర్తి కానుంది. ఇప్పటికే ఓటరు నమోదు కోసం జిల్లాలో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. కొత్తగా ఓటర్ల నమోదు కోసం సోమవారం వరకు 24,067 దరఖాస్తులు అందాయి. వీటిలో 18 ఏళ్లు నిండిన వారి దరఖాస్తులు 4 వేలకుపైగా ఉన్నాయి. ఈ సోమవారం వచ్చిన దరఖాస్తులతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 8వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. ఓట్లు గల్లంతు అనేది వాసత్వం కాదు. బోగస్‌ ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నాం. రెండు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు ఉన్న పక్షంలో ఒకచోట జాబితాలో నుంచి  పేర్లును తొలగిస్తున్నాం. జిల్లాలో 4వేల మంది ఓటర్ల పేర్లను తొలగించనున్నాం. మృతి చెందిన 5,464 మంది పేర్లను సైతం జాబితాలో నుంచి తొలగిస్తున్నాం.

ట్యాపర్‌ చేస్తే ఫ్యాక్టరీ మోడ్‌లోకి ..
ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. బ్యాలెట్‌ యూనిట్లు 860, కంట్రోల్‌ యూనిట్లు 670 ,  వీవీపాట్‌లు 670 జిల్లాకు వచ్చాయి. రెండు మూడు రోజుల్లో రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తాం. వీవీపాట్‌ల పనితీరును అందరూ పరిశీలించవచ్చు. అలాగే గ్రామాల్లో సైతం అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేసింది ఈ ఈవీఎంల ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్‌ సమయంలో ఈవీఎం, వీవీపాట్‌లను టాంపరింగ్‌ చేసే అవకాశం లేదు. ఎవరైనా ఈవీఎం, వీవీప్యాట్‌లకు ట్యాంపర్‌ చేసే ప్రయత్నం చేస్తే అవి వెంటనే ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోతాయి.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ 
జిల్లా అధికారులతోపాటు ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల నిర్వహణకు 4 వేల సిబ్బంది అవసరం కానున్నారు.  నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం పోలింగ్‌ సిబ్బంది నియామకం చేపడతాం. సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరైమన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.
 
ఆర్టీసీ ఉద్యోగులకు బ్యాలెట్‌ పోలింగ్‌
ఉద్యోగులు ఖచ్చితంగా బ్యాలెట్‌ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది బ్యాలెట్‌ ఓటింగ్‌పై శద్ధ చూపడం లేదు. ఓటు హక్కు తక్కువగా వినియోగించుకునే వారిలో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.  ఇందుకోసం ఆర్టీసీ సిబ్బంది జాబితాను ముందుగానే తెప్పించుకుంటున్నాం. ఆర్టీసీ సిబ్బంది అంతా బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడతాం.

మూడు ప్రత్యేకమైన యాప్‌లు
రాబోయే ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట అమలులోకి వచ్చిన వెంటనే ‘సి–విజిల్‌’ పనిచేయటం ప్రారంభం అవుతుంది.  ఏ రాజకీయపార్టీకి చెందిన నాయకులైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తే వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా ఫోటోలు లేదా వీడియోలు తీసి “సి–విజిల్‌’లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  అప్‌లోడ్‌ అయిన వెంటనే ఎన్నికల కమిషన్‌ అధికారులు రంగంలోకి దిగి  విచారణ జరిపి వెంటనే  చర్యలు తీసుకుంటారు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వారి పేరు, ఫోన్‌ నంబరు తదితర వివరాలు గోప్యంగా  ఉంచుతారు. దీనితోపాటు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల కోసం ‘నేషనల్‌ గ్రివెన్స్‌ సర్వీస్‌’ యాప్‌ను రూపొందించింది.


ఓటర్లు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. రాజకీయపార్టీల కోసం ఎన్నికల కమిషన్‌ ‘సువిధ’ పేరిట మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకవస్తోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల నిర్వహణ, లౌడ్‌ స్పీకర్లకు వినియోగానికి అనుమతుల కోసం ‘సువిధ’ యాప్‌లో అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఎన్నికల కమిషన్‌ నేరుగా అనుమతులు జారీ చేయటం జరుగుతుంది. 

పోలింగ్‌ కేంద్రాల్లో కరెంటు సమస్య 
జిల్లాలో మొత్తం 538 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఎంపిక చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రధానంగా కరెంటు సమస్య ఉంది. దీన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే తాగునీరు, టాయిటెట్లు, ర్యాంపుల నిర్మాణం తదితర అంశాలను పరిశీలిస్తున్నాం. 

ఐపీ కెమెరాలతో పోలింగ్‌ లైవ్‌

పోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ కెమెరాలతో లైవ్‌ పోలింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో వెబ్‌లైవ్‌ కాస్ట్‌ ఉండేది. కాగా రాబోయే ఎన్నికల్లో ఐపీ కెమెరాలతో లైవ్‌ పెట్టించనున్నాం. తద్వారా ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందించేందుకు వీలు ఉంటుంది. ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల సంఘం 1950 పేరిట టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు