‘కొడ్‌’ పాటించండి

29 Sep, 2018 10:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, పాల్గొన్న రెవెన్యూ, అటవీ అధికారులు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఎన్నికల నియ మావళికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ తాజాగా ఆదేశాలు జారీ చేసినందున,  అందుకనుగుణంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్షి సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ఖచ్చితత్వంతో, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల పనులకు సంబంధించి అధికారులు ప్రతి విషయానికి వెంటనే స్పందించాలని, ప్రధాన కార్యస్థానాల్లోనే ఉండాలని, ఈ సమయం అత్యంత ముఖ్యమైనదన్నారు.

అదే విధంగా ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారు, పూర్తిగా అందుబాటులో లేని వారు, రెండు పేర్లున్న వారికి నోటీసులు జారీ చేసినందున ఈ నెల 30లోగా అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. వయసు తప్పుగా నమోదైనవి ఉంటే సరి చేసి అర్హులను జాబితాలో ఉంచాలన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్యగా మారిన భూములకు సంబంధించి ఆరు శాఖల అధికారులు సంయుక్త సర్వే జరిపి నివేదికలు అందించాలని, అర్హులకు న్యాయం జరిగేలా, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ శాంసన్, తహశీల్ధార్లు, రెవెన్యూ ,అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు