మొదలైన నామినేషన్ల పర్వం

13 Nov, 2018 08:29 IST|Sakshi
బూడిద భిక్షమయ్యగౌడ్‌ తరఫున నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న లగ్గాని నర్సింహగౌడ్‌

సాక్షి,ఆలేరు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆలేరు అసెంబ్లీ స్థానానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, రిటర్నింగ్‌ ఎన్నికల సహాయ అధికారి శ్యాంసుందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అలాగే బూడిద భిక్షమయ్యగౌడ్‌ తరపున లగ్గాని నర్సింహగౌడ్, బూడిద సువర్ణ తరపున తవిటి నర్సిరెడ్డి నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. సునీత తరపున ఎంపీపీ కాసగళ్ల అనసూయ, గుట్ట జెడ్పీటీసీ కర్రె వెంకటయ్య, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆకవరం మోహన్‌రావులు నామినేషన్‌ పత్రాలను అందించిన వారిలో ఉన్నారు.  
భారీ బందోబస్తు:
ఎన్నికల్లో భాగంగా ఆలేరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోకి ఇతరులను అనుమతించటం లేదు. నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థుల వాహనాలను కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉంచారు. ఏసీపీ మనో హర్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ ఆంజనేయులు,స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి  బందోబస్తు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు