స్టార్‌వార్‌

24 Nov, 2018 13:01 IST|Sakshi

ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. వీలైనంతగా రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళి కలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ అనుచరగణాన్ని ఇంటింటికీ వెళ్లేలా పురమాయిస్తున్నారు. పనిలో పనిగా స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 25న ఖేడ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. 28న ఒకేరోజు నాలుగు బహిరంగసభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సభలు ఉండనున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోనియా లేదాæ రాహుల్‌తో సభ నిర్వహించే ఆలోచన ఉందని కాంగ్రెస్‌  నేతలు చెబుతున్నారు. మొత్తంగా స్టార్‌ల రాకతో ప్రచారం వేడెక్కనుంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రావడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందు ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన టీఆర్‌ఎస్, బహిరంగ సభల నిర్వహణపైనా దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఈ నెల 28న జిల్లా పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే టీఆర్‌ఎస్‌ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జోగిపేట, నారాయణఖేడ్‌లో పార్టీ నేతలతో సమీక్ష జరిపారు.

కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేత హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో జరిగే సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా షెడ్యూలు సిద్ధం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ నెల 29న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జహీరాబాద్‌లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 2న ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పటాన్‌చెరు, సంగారెడ్డిలో జరిగే ర్యాలీకి హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఖరారు కాని కాంగ్రెస్‌ ప్రచార షెడ్యూలు
భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషం వరకు మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌.. అగ్రనేతల ప్రచార షెడ్యూలును ఇంకా ఖరారు చేయలేదు. పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవడంపైనే దృష్టి సారించారు. జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించినా, ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కావాల్సిఉంది. 

మరోవైపు నారాయణఖేడ్, పటాన్‌చెరు అభ్యర్థులను నామినేషన్ల చివరి రోజున ప్రకటించడంతో, అభ్యర్థులు ఇంకా సొంత గూటిని సర్దుకోవడంలోనే తీరిక లేకుండా ఉన్నారు. నారాయణఖేడ్‌లో పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకున్న మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకునే దశలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభమయ్యేందుకు మరో రెండు మూడు రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది.

పటాన్‌చెరులో అసంతృప్త నేతలను బుజ్జగించడంలో సఫలమైన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఈ నెలాఖరు లేదా డిసెంబర్‌ మూడో తేదీలోగా జిల్లా పరిధిలో జరిగే బహిరంగ సభకు సోనియా లేదా రాహుల్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమయం తక్కువగా ఉండడంతో బహిరంగ సభల నిర్వహణతో ప్రజల్లోకి వెళ్లలేమనే ఆందోళన కాంగ్రెస్‌ అభ్యర్థులను పీడిస్తోంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా