‘పట్నం’ టికెట్‌పై నజర్‌!

10 Sep, 2018 12:47 IST|Sakshi
క్యామ మల్లేశ్‌ డీసీసీ అధ్యక్షుడు రొక్కం భీంరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్‌రెడ్డి, రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం:  కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆ పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో సానుకూలంగా స్పందిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో టీడీపీకి క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. 1985, 1999, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అభ్యర్థి విజయం సాధించారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ 1985 నుంచి ఈ స్థానంలో గెలుపు సాధించ లేదు. నియోజకవర్గంలో హస్తం పార్టీకి మంచి పట్టున్నా గ్రూపు తగదాలే కొంప ముంచుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ ఫిరాయించి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈనేపథ్యంలో ఆ పార్టీకి కొంత బలం తగ్గినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీని వీడలేదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహిస్తున్నారు.
 
పట్నం సీటుపై ఇరుపార్టీల దృష్టి 
టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య పొత్తు కుదిరితే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం కోసం ఇరుపార్టీల నేతలు పట్టుబట్టే ఆవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాన్ని వదలుకునేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధంగా లేరు. ఈనేపథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు కొంత ఆందోళనకు గురవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రొక్కం భీంరెడ్డి ఈ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తోపాటు, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి టికెట్‌ రేసులో ముందున్నారు. ఈ స్థానాన్ని వదులుకోవద్దని ఇరుపార్టీల నేతలు తమ అధిష్టానాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి టీడీపీతో జతకడితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఇక్కడ గడ్డు పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టీడీపీ, కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహలు ఏటు వైపు వెళ్తాయో.. టికెట్‌ ఎవరిని వరిస్తుందో ఇంకొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.

ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యం..
టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించాలనే ఉద్దేశంతో మిగతా పార్టీలు జతకడుతున్నాయి. పొత్తుతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు ఆయా పార్టీల పెద్దలు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమైతే ఇబ్రహీంపట్నంలో గులాబీ పార్టీ అ భ్యర్థిని సులువుగా దెబ్బతీయవచ్చునని అం చనా వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అత్యధిక శాతం టీడీపీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్‌ నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌తో దోస్తీని నేతలేవ్వరూ వ్యతిరేకించకపోవడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు