మహిళలకు ఎన్నికల్లో దక్కని ప్రాధాన్యం

28 Nov, 2018 10:28 IST|Sakshi

ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి ఎవరూ పాటించడం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. అవకాశాలు లేక మహిళలు అట్టడుగునే ఉంటున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో చూసుకుంటే.. మొత్తం ఓటర్లలో సగటున మహిళలే ఎక్కువగా నమోదయ్యారు. ఆ మేరకు రాజకీయంగా మాత్రం వారికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారగా, భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. మిగతా ఏ పార్టీలు కూడా పట్టించుకోలేదు. జిల్లాలో పురుషుల ఓటర్లతో పోల్చుకుంటే.. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నప్పటికీ.. వారికి సముచిత స్థానం కల్పించడంలో పార్టీలు విఫలమయ్యాయన్న చర్చ సర్వత్రా సాగుతోంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాలు కలిపి మొత్తం 61 మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి, స్వతంత్రంగా బరిలో నిలిస్తే.. అందులో మహిళ ఒకరంటే ఒక్కరే ఉండటం ఆయా పార్టీల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహిళలు సైతం స్వతంత్రంగానైనా బరిలో నిలిచే సాహసం చేయకపోవడం సమాజంలో మహిళలంటే వివక్ష దూరం కాలేదన్న వాదనకు తెరలేపుతోంది. శాసనకర్తలు మహిళలు ఉంటే ఆ వర్గానికి మరింత న్యాయం జరుగుతుందనేది అందరూ ఏకీభవించాల్సిన వాస్తవం. మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాజకీయాల్లో మాత్రం వారికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పవచ్చు.

ఇందుకు ప్రస్తుత శాసనసభ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా.. ఒకే ఒక్క మహిళ శాసనసభ పోరులో నిలబడటం చూస్తుంటే పార్టీలు మహిళలను ఓట్లు వేసేవారిగానే తప్ప.. పాలనా యంత్రాంగాన్ని నడిపించే మహాశక్తిగా మాత్రం గుర్తించడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలో తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం ఓటర్లు 9,11,480 మంది ఉంటే.. పురుషులు 4,53,618 కాగా, మహిళ ఓటర్లు 4,57,808 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలు 5,190 మంది ఎక్కువగా ఉన్నారు. చొప్పదండి నుంచి 13 మంది బరిలో ఉండగా, మహిళా అభ్యర్థిగా బొడిగె శోభ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మానకొండూరులో 13, కరీంనగర్‌లో 25, హుజూరాబాద్‌లో 10 మంది అభ్యర్థులు ఉండగా, ప్రధాన పార్టీలు మహిళా ఓటర్లకు అనుగుణంగా అవకాశం కల్పించలేకపోయాయి.
 
నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ల లెక్క ఇదీ..
కరీంనగర్‌ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, కరీంనగర్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్‌లో 2,87,021 మంది ఓటర్లుంటే.. 1,43,956 మంది పురుషులు, 1,43,032 మంది మహిళలు ఉండగా, 33 మంది థర్డ్‌జెండర్స్‌ ఉన్నారు. చొప్పదండిలో 2,12,731 ఓట్లకు 1,04,482 పురుషులు, 1,08,246 మహిళలు, మానకొండూరులో 2,02,504 ఓట్లకు 1,00,588 పురుషులు, 1,01,915 మహిళలు, హుజూరాబాద్‌లో 2,09,224 మంది ఓటర్లలో 1,04,592 పురుషులు, 1,04,615 మంది మహిళా ఓటర్లున్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించడంలో మహిళా ఓట్లే కీలకంగా మారనున్నాయి. వారు తలుచుకుంటే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగలరు. ఇక ముందు జరిగే ఎన్నికల్లో తమకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని మహిళల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ఎప్పుడు ఎన్నకలు వచ్చినా.. రాజకీయ పార్టీలు మహిళల జనాభా, ఓటర్లకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తిని కూడా వ్యక్తమవుతోంది.

ఇప్పటిదాకా ఇద్దరికే అవకాశం..
1952 నుంచి ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సుమారుగా సాధారణ, ఉప ఎన్నికలు కలుపుకుని 13 నుంచి 15 ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గాల్లో ఇద్దరికి మాత్రమే మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించాయి. 2004లో కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గండ్ర నళినికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం దక్కింది.

అదేవిధంగా ఎస్‌సీ రిజర్వుడు స్థానం చొప్పదండి నుంచి బొడిగె శోభకు 2014లో టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించగా, ఈసారి ఆమెకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శోభ బీజేపీలో చేరగా.. బీజేపీ అవకాశం కల్పించింది. ఓటర్ల విషయంలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నా.. ఎమ్మెల్యేలుగా ఎదిగేందుకు మాత్రం మహిళలకు అవకాశాలు తక్కువనేందుకు ఇవన్నీ నిదర్శనాలే. రానున్న రోజుల్లో జిల్లా నుంచి శాసనసభకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగేలా అన్నీ పార్టీలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు