ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌

24 May, 2018 01:52 IST|Sakshi
జోనల్‌ విధానంపై ప్రతిపాదనలను సమన్వయకర్త దేవీప్రసాద్‌కు అందజేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీ

4 నుంచి 12వ తరగతిని ఆధారంగా తీసుకోవాలి 

4 జోన్లతో యువతకు ఇబ్బందులు 

కనీసంగా ఐదు జోన్లుడాలి.. ఆరు అయినా ఓకే 

జోనల్‌ విధానంపై ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్థానికతను నిర్ధారించేందుకు 4 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివారన్న అంశాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. కడియం శ్రీహరి కమిటీ సిఫారసు చేసిన విధంగా ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణనలోకి తీసుకోవద్దని పేర్కొంది. 4 నుంచి 12 దాకా వరుసగా ఏడేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు లోకల్‌గా పరిగణించాలని సూచించింది. 4 నుంచి 12వ తరగతిని పరిగణనలోకి తీసుకునే క్రమంలో ఒకవేళ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే వారి తల్లిదండ్రుల స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. బుధవారం టీఎన్‌జీవో భవన్‌లో చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది.

ఇందులో జేఏసీ సెక్రటరీ జనరల్‌ వి.మమత, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్‌ విధానం, స్థానికతపై పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం జోనల్‌ విధానం ఉండాల్సిన తీరుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 4 జోన్ల విధానం వల్ల విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, కనీసం 5 జోన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 6 జోన్లు ఉన్నా ఓకేనని పేర్కొంది. పాత జిల్లా ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను రెండు మల్టీ జోన్లుగా చేయాలని ప్రతిపాదించింది. అలాగే అన్ని కేటగిరీల పోస్టుల్లో 80% లోకల్, 20% ఓపెన్‌ కేటగిరీ (రాష్ట్ర పరిధిలోని వారికే) విధానం ఉండాలని, లేదంటే 70:30 నిష్పత్తిన ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వివిధ సంఘాల అభిప్రాయాలు, సమావేశ తీర్మానాలతో రూపొందించిన ప్రతిపాదనలను సమన్వయకర్త దేవీప్రసాద్‌కు జేఏసీ నేతలు అందజేశారు. వాటిపై గురువారం లేదా శుక్రవారం సీఎంతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐదు జోన్లు ఉంటేనే సమస్యలు ఉండవని దేవీ ప్రసాద్‌ వద్ద జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఐదు వద్దనుకుంటే ఆరు జోన్లు చేసినా అంగీకారమేనని వెల్లడించారు. 

జోన్లపై ఇవీ ప్రతిపాదనలు.. 
జోన్లపై జేఏసీ రెండు రకాల ప్రతిపాదనలు చేసింది. ఒకటి ఐదు జోన్ల విధానం.. అది వద్దనుకుంటే ఆరు జోన్ల విధానం. ఐదు జోన్లలో.. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్, కరీంనగర్‌ ఒక జోన్‌గా, వరంగల్, ఖమ్మం ఒక జోన్‌గా, మహబూబ్‌నగర్, నల్లగొండ ఒక జోన్‌గా, మెదక్, నిజామాబాద్‌ ఒక జోన్‌గా, హైదరాబాద్, రంగారెడ్డి ఒక జోన్‌గా మొత్తం ఐదు జోన్లు ఉండాలి. పాత జిల్లాల పరిధిలోని ఆయా జిల్లాలన్నీ ఆయా జోన్ల పరిధిలోకి వస్తాయి. ఐదు జోన్లు వద్దనుకుంటే హైదరాబాద్‌ ఒక జోన్‌గా, రంగారెడ్డి మరో జోన్‌గా చేసి ఆరో జోన్లు ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇది అవసరమని పేర్కొంది. 

ఇప్పుడున్న రెండూ మల్టీ జోన్లుగా... 

  • ప్రస్తుతమున్న 5వ జోన్‌ను మల్టీ జోన్‌–1గా చేయాలని, 6వ జోన్‌ను మల్టీ జోన్‌–2గా చేయాలని పేర్కొంది 
  • రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉండకూడదు. పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న గ్రూప్‌–1 తరహా పోస్టులన్నీ మల్టీ జోన్‌ పరిధిలో నే భర్తీ చేయాలని సూచించింది. తద్వారా ఇతర రాష్ట్రాల వారిని నిరోధించవచ్చని తెలిపింది 
  • పోస్టుల భర్తీలో 70% పదోన్నతుల ద్వారా, 30% డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేయాలి. అవీ జిల్లా, జోన్, మల్టీ జోన్‌లోనే ఉండాలని పేర్కొంది 
  • జూనియర్‌ అసిస్టెంట్, అంతకంటే కిందిస్థాయి పోస్టులన్నీ జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వెల్లడించింది 
  • సెకండరీ గ్రేడ్‌ టీచర్, స్కూల్‌ అసిస్టెంట్‌ జిల్లా కేడర్‌లో, గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్, మండల విద్యాధికారి జోనల్‌ కేడర్‌లో, డిప్యూటీ ఈవో మల్టీ జోన్‌ కేడర్‌లో, అంతకంటే పైస్థాయి పోస్టులన్నీ స్టేట్‌ కేడర్‌లో ఉండాలని జేఏసీ ప్రతిపాదించింది.  
మరిన్ని వార్తలు