‘ఇంజనీరింగ్‌’ వసూళ్లు...!

29 May, 2018 02:34 IST|Sakshi

యాజమాన్య కోటా సీట్లకు మరింత పెరిగిన డిమాండ్‌ 

కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.15 లక్షలు.. ఐటీకి రూ.7 లక్షలకుపైనే...

మెరిట్‌కు విలువ లేదు.. ఓ అధికారి, ఓ మంత్రి పీఏ వల్ల ఈ పరిస్థితి..

వారు చెప్పినవారికి ఫ్రీగా 10 సీట్లు!

అలా తగ్గే మొత్తం కోసం ‘ధరలు’ మరింత పెంపు!  

  • శ్రీధర్‌ ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. తన కుమారుడికి హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో యాజమాన్య కోటా సీటు కోసం వెళితే.. ఏకంగా రూ.7 లక్షలు చెప్పారు.
  • ప్రభుత్వోద్యోగి అయిన రవీందర్‌ కుమార్తెకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. దీంతో ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీకి వెళితే.. కంప్యూటర్‌ సైన్స్‌ యాజమాన్య కోటా సీటు కోసం రూ.15 లక్షలు అడిగారు. మంచి కాలేజీ కదా అని.. రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించి సీటు కన్‌ఫర్మ్‌ చేయించుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు ఇంజ నీరింగ్‌ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇది. కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను అమ్మేసు కుంటున్నాయి. భర్తీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. ప్రముఖ కాలేజీలైతే రేట్లను మరింతగా పెంచేశాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఎలాగైనా మంచి కాలేజీల్లో చదివించాలన్న ఉద్దేశంతో అప్పులు చేసైనా అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు.

కాలేజీని బట్టి వసూళ్లు..
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం సొంతంగా భర్తీ చేసుకునే సీట్లుపోగా.. 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,055 సీట్లు కాకుండా) సీట్ల (70 శాతం)ను భర్తీ చేయనుండగా... యాజమాన్య కోటా (15 శాతం), ఎన్నారై/ఎన్‌ఆర్‌ స్పాన్సర్డ్‌ (15 శాతం) కోటాల కింద 26,389 సీట్ల (30 శాతం)ను భర్తీ చేస్తారు. అయితే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో చేరే విద్యార్థులు ఎక్కువగా పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు. దీంతో పలు కాలేజీలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న చాలా కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా వసూళ్ల దందాకు దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కోసం ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.10 లక్షల వరకు డొనేషన్‌ డిమాండ్‌ చేస్తుండగా.. టాప్‌ కాలేజీలు రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఐటీ, ఈసీఈ కోర్సులకు కాలేజీని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. ఈఈఈ, సివిల్‌తోపాటు ఇతర బ్రాంచీలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మెరిట్‌కు స్థానమేదీ?
యాజమాన్య కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా.. మిగతా 15 శాతాన్ని ఎన్నారైలకు, వారు స్పాన్సర్‌ చేసిన వారికి ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్‌ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్‌ మార్కుల మెరిట్‌ సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇదేదీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్ల కోసం కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఉన్నత విద్యా మండలికూడా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించి.. ఆయా కాలేజీలకు పంపాలి. మొత్తంగా మెరిట్‌ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యా మండలిగానీ, సాంకేతిక విద్యాశాఖగానీ దీనిని పట్టించుకోకపోతుండటంతో.. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. గతేడాది కొన్ని టాప్‌ కాలేజీల్లో ఏకంగా 80వేలకు పైన ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీట్లివ్వడమే దీనికి నిదర్శనం.

ఆ ‘ఇద్దరి’తో పెరిగిన రేట్లు!
ఏఐసీటీఈ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన 100కుపైగా కాలేజీలకు తొలుత అనుమతి నిరాకరించింది. వాటి యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో.. ఏఐసీటీఈతో మాట్లాడి అనుమతులు ఇప్పించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి, ఓ మంత్రి పీఏ తాము చెప్పిన వారికి యాజమాన్య కోటా సీట్లు ఇవ్వాలని ఆయా కాలేజీలతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో వారు చెప్పిన మేరకు డొనేషన్‌ లేకుండా 10 సీట్లు ఇవ్వాల్సి వస్తోందని.. అందువల్లే ఈసారి డొనేషన్లను పెంచాల్సి వచ్చిందని, లేకుంటే కన్వీనర్‌ కోటా ఫీజుతో కాలేజీలు ఎలా నడపాలంటూ కాలేజీలు ఎదురు ప్రశ్నిస్తున్నాయని అధికారులే చెబుతుండటం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు