రాకపోకలకు గ్రీన్‌ సిగ్నల్‌

1 Jun, 2020 01:50 IST|Sakshi

ఇతర రాష్ట్రాల నుంచి రావడంపై ఆంక్షల్లేవు.. అనుమతి అక్కర్లేదు

ఇక రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకే కర్ఫ్యూ.. షాపులకు రాత్రి 8 వరకు అనుమతి

జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు..

ఉత్తర్వులు జారీ 

సాక్షి, హైదరాబాద్‌ : కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6గంటల వరకురాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. కేవలం అత్యవసర వైద్య సేవల కోసమే ప్రజలను బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం కర్ఫ్యూను ప్రభుత్వం సడలించింది. ఇకపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే జన సంచారంపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాత్రి 8 గంటల వరకు దుకా ణాలు, వ్యాపార సముదాయాలను తెరిచి ఉంచుకోవచ్చు. ఆస్పత్రులు, మందుల దుకాణాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ప్రజల రాకపోకలపై ఉన్న ఆంక్షల ను ఎత్తేశారు. ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అవసరం ఉండదు.

కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం ఇప్పటివరకు అమలు చేసిన లాక్‌డౌన్‌ నిబంధనలనే యథాతథంగా అమలు చేయనున్నారు.

సీఎం సమీక్ష
కేంద్రం లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలను జారీ చేయడంతో రాష్ట్రంలో అమలు చేయాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఆదివారం సమీక్షిం చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8 నుంచి కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తేసే అవకాశాలున్నాయి. ఇందుకు సంబం ధించి జూన్‌ తొలివారంలో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిసింది.

మరిన్ని వార్తలు