తెలంగాణ రాబట్టే.. పొలాలు ఎండుతలేవు

23 Apr, 2015 02:07 IST|Sakshi
తెలంగాణ రాబట్టే.. పొలాలు ఎండుతలేవు

ముఖ్యమంత్రి కేసీఆర్ 
టీఆర్‌ఎస్‌లో చేరిన కరీంనగర్ డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ కీలక నేతలు

 
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ నాయకులంతా ఐదేళ్లు కలసి నడిస్తే వచ్చే వందేళ్లు రాష్ట్రం సుఖసంతోషాలతో ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పలువురు కరీంనగర్ కాంగ్రెస్ నేతలు బుధవారం సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాబట్టే ఈ ఏడాది రైతుల పొలాలు ఎండలేదన్నారు. భవిష్యత్తులో విద్యుత్ కోతలు ఉండవని, వచ్చే మార్చి తర్వాత 9 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయతో ఎగువ మానేరు నిండి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల కరువు తొలగిపోతుందని స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యలను దూరం చేసేందుకు అక్కడి నాయకులంతా కలసి రావాలని కోరారు. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నేత రవీందర్‌రావు, మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. స్వయంగా ఒక రోజు సిరిసిల్లకు వచ్చి అక్కడి ప్రజలతో రోజంతా ఉంటానని కేసీఆర్ చెప్పారు. సిరిసిల్ల అభివృద్ధికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.  కాగా, కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నుంచి భారీగా చేరికలు జరిగాయి. నాలుగు ద శాబ్దాలుగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎవరూ చేపట్టడం చూడలేని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు రవీందర్‌రావు పేర్కొన్నారు. డీసీసీబీ డెరైక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఏడుగురు కౌన్సిలర్లు 20 మంది ఎంపీటీసీ సభ్యులు, 30 మంది సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు