మరింత వాటాకు పట్టు

25 May, 2020 02:19 IST|Sakshi

కృష్ణా బోర్డు భేటీకి ఎజెండా ఖరారు చేసిన తెలంగాణ

4 అంశాలతో మంగళవారం బోర్డుకు సమర్పణ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలపై బోర్డు జరిపే భేటీలో ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే చర్చించాలని తెలంగాణ నిర్ణయించింది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచేలా తీసుకొచ్చిన జీవో 203ను నిలుపుదల చేసే అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ.. బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై త్వరలోనే భేటీ నిర్వహిస్తామని, అందులో చర్చించే ఎజెండాను 26వ తేదీలోగా అందించాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ 4 అంశాలతో ఎజెండాను ఖరారు చేసింది. తెలంగాణకు అడ్‌హక్‌గా కేటాయించిన 299 టీఎంసీల నీటికి అదనంగా పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి మళ్లింపు జలాలతో తెలంగాణకు దక్కే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమలతో బచావత్‌ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు కనీసంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, ప్రస్తుతానికి పోలవరం వాటాను పక్కన పెట్టినా, పట్టిసీమ ద్వారా దక్కే 45 టీఎంసీలను కేటాయించి, తమ వాటా పెంచాలని తెలంగాణ కోరనుంది. అలాగే, ఈ వాటర్‌ ఇయర్‌లో ఏపీ చేసిన అదనపు వినియోగాన్ని వచ్చే జూన్‌ నుంచి ఆరంభమయ్యే వాటర్‌ ఇయర్‌లో కలపాలని కోరనుంది. తాగునీటి వినియోగ అంశాలను సైతం ఎజెండాలో చేర్చింది.  

మరిన్ని వార్తలు