బడ్జెట్‌ సరికొత్తగా..

8 Feb, 2018 03:48 IST|Sakshi

అంచనాలు కాకుండా.. వాస్తవికతకు దగ్గరగా నిర్వహణ పద్దు

ఒక్కో ఉద్యోగి లెక్కన జీతాల వ్యయం మదింపు

పెన్షన్లు, ఇతర నిర్వహణ ఖర్చుల వివరాలు సేకరణ

ప్రభుత్వ ఆస్తులు, బకాయిల లెక్కలు కూడా..

అద్దె వాహనాల వినియోగంపైనా ఆరా

ఆనవాయితీకి భిన్నంగా ఆర్థిక శాఖ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులుగా గతేడాది కొత్త రూపు సంతరించుకున్న రాష్ట్ర బడ్జెట్‌.. ఈసారి మరిన్ని ప్రయోగాలతో సరికొత్తగా మారిపోతోంది. నిర్వహణ పద్దును అంచనాలు, ఊహాలతో కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ, పాలనాపరమైన ఖర్చులన్నింటినీ కచ్చితంగా లెక్కించేందుకు చర్యలు చేపట్టింది. వివిధ శాఖల వారీగా కూడా ఆదాయం, ఖర్చులు, నిర్వహణా వ్యయం, అద్దె వాహనాలు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తోంది. తద్వారా అనవసరపు ఖర్చులను నియంత్రించడం, గందరగోళ పరిస్థితిని నివారించవచ్చని భావిస్తోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది.

వాస్తవాలకు, అంచనాలకు మధ్య తేడాతో..
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్లు, కార్యాలయాల ఖర్చులు, వాహనాలు, నిర్వహణ, పరిపాలనా పరమైన ఖర్చులన్నీ బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద ఉంటాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.49 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. అందులో రూ.61,607 కోట్లు నిర్వహణ పద్దులో చూపించింది. అయితే ఇందులో వాస్తవ ఖర్చులకు, అంచనాలకు మధ్య పది పదిహేను శాతం మేర తేడా ఉందని ఆర్థిక శాఖ ప్రాథమికంగా గుర్తించింది. వాస్తవానికి అన్ని శాఖలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా నిర్వహణ పద్దును తయారు చేస్తారు. ఆయా శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులపై కచ్చితమైన అంచనాలు వేయకపోతుండడంతో ప్రతిపాదనల తయారీ తూతూమంత్రంగా సాగుతోంది. ప్రధానంగా యూనివర్సిటీలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలేవీ ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవు. ఆయా సంస్థలు ఇచ్చే అంచనాల ఆధారంగానే నిధులు ఇస్తున్నారు. నిక్కచ్చిగా ఖర్చు లెక్కతీసిన సందర్భాలు లేవు. తాజాగా ఈ ఆనవాయితీకి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి శాఖ, విభాగం పరిధిలోని ప్రతి ఉద్యోగి జీతభత్యాలు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తోంది. వీరితో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జాబితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అన్ని శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం ప్రభుత్వోద్యోగులకు చెల్లించే జీతభత్యాలు, పెన్షనర్లకు చేసే చెల్లింపులు కచ్చితంగా తేలనున్నాయి.

ఆస్తులు, బకాయిలపైనా ఆరా
ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. వాస్తవంగా ఎంతమేర పని జరిగింది, ఎంత మేర బిల్లులు చెల్లించాల్సి ఉందన్న వివరాలు ఆరా తీస్తోంది. దీనివల్ల ఏయే విభాగానికి, ఏయే పనులకు ఎంత మేర బకాయి ఉన్నదీ పూర్తిగా వెల్లడికానుంది. ఇక ఆదాయం, ఖర్చుల వివరాలే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఆస్తుల వివరాలనూ బడ్జెట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు ఏయే స్థాయిలో ఉన్నాయో కూడా వివరించాలని భావిస్తోంది.

అడ్డగోలు బ్యాంకు ఖాతాల కట్టడి
రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తమకు నచ్చిన బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే విధానం అమల్లో ఉంది. దీంతో బ్యాంకులు ఇచ్చే కమీషన్లు, వడ్డీ డబ్బులకు కక్కుర్తిపడి కొందరు అధికారులు అవసరమున్నా, లేకున్నా ఎక్కువ సంఖ్యలో ఖాతాలు తెరిచారు. ప్రస్తుతం వేల సంఖ్యలో పీడీ (ప్రాజెక్టు డైరెక్టర్‌) ఖాతాలు ఉన్నాయి. ఇలాగైతే ప్రభుత్వ ఖాతాల్లో ఎన్ని నిధులున్నాయి, ఎంత మిగులు ఉందన్న లెక్కతేలదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌కు ముందే అన్ని స్థాయిల అధికారులు తమ శాఖలు, విభాగాలు, కార్యాలయాలకు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని ఆదేశించింది. అప్పటికీ కొన్ని ఖాతాల వివరాలు గుట్టుగా ఉంచే అవకాశం ఉందన్న సందేహాలు ఉన్నాయి. అందువల్ల నిర్ణీత గడువులోగా ఇచ్చిన సమాచారం మేరకు బ్యాంకు ఖాతాలను అధికారికంగా నోటిఫై చేయాలని.. మిగతా ప్రభుత్వ ఖాతాలను చెల్లనివిగా గుర్తించాలని భావిస్తోంది. అలాంటి వాటిలో ఉన్న నిధులను దుర్వినియోగపు సొమ్ముగా భావించి సీజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది.

అద్దె వాహనాలపై నిఘా..
వివిధ శాఖల పరిధిలో అద్దెకు తీసుకునే వాహనాల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది. అద్దె వాహనాల కోసం రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏటా భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయాల వారీగా ఉన్న వాహనాలు, వాటి నంబర్లు, చెల్లిస్తున్న అద్దె తదితర వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు