తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక 63,047 కోట్లు

9 Aug, 2014 02:09 IST|Sakshi
తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక 63,047 కోట్లు

* తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక ఆవిష్కరణ
* బంగారు తెలంగాణలో భాగస్వాములమవుతామన్న ఎస్‌బీహెచ్ ఎండీ
* సీఎం కేసీఆర్ గైర్హాజరు,  మంత్రులూ దూరం

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొదటి పరపతి ప్రణాళిక విడుదలయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 63,047 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) రూపొందించిన పరపతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం విడుదల చేశారు. హోటల్ మారియట్‌లో తెలంగాణ ఎస్‌ఎల్‌బీసీ రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులూ గైర్హాజరయ్యారు.
 
ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, బీఆర్ మీనా, పూనం మాలకొండయ్యలు హాజరయ్యారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల కింద రూ. 18,717.95 కోట్లు, టర్మ్ రుణాల కింద రూ. 6238.48 కోట్లు మంజూరు చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. మొత్తం ప్రాధాన్య రంగాలకు రూ. 40,546.51 కోట్లు, ఇతర రంగాలకు మరో రూ.22,501.11 కోట్లు కలిపి మొత్తం రూ. 63,047.62 కోట్ల మేర తెలంగాణ రాష్ట్రంలో రుణాలను  ఈ ఏడాది మంజూరు చేయనున్నట్టు ఈ పరపతి ప్రణాళికలో వివరించారు. గత ఏడాది రూ. 55113.45 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 14.4 శాతం అధికం.
 
 పరపతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు...
* వ్యవసాయ రంగానికి గత ఏడాదిరూ. 23,719 కోట్లు మంజూరు చేయగా, ఈసారి రూ.27,233.59 కోట్లను బ్యాంకులు మంజూరు చేస్తాయి.
* నాబార్డు సూచనల మేరకు వ్యవసాయ రుణాల మొత్తాన్ని గత ఏడాది(రూ. 5,767 కోట్లు) ఇస్తే, ఈసారి రూ. 8.515.64 కోట్లకు పెంచారు.
 
 ఏడాదిలో అందరికీ బ్యాంకు అకౌంట్లు...
 వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు తెరవనున్నట్టు ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్‌బీహెచ్ ఎండీ  శంతన్ ముఖర్జీ తెలిపారు. ఈ నెల 15 న ప్రధానమంత్రి మిషన్‌మోడ్‌ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో పరపతి ప్రణాళిక ప్రకటించడం ఆలస్యమైందన్నా రు. ఎస్‌బీహెచ్ తొలిసారి లీడ్‌బ్యాంక్‌గా ఎస్‌ఎల్‌బీసీకి నేతృత్వం వహిస్తోందన్నారు.
 
 విభజన సమయంలో వివరాలు ఇవ్వలేదు: సీఎస్ రాజీవ్‌శర్మ
 ఈ సమావేశానికి సీఎం రావాల్సి ఉన్నప్పటికీ రాలేకపోయారు. ఆయన సందేశాన్ని మీకు తెలుపుతున్నాను. రాష్ర్ట విభజన సమయంలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోవడంతో పంట నష్టం వివరాలను అప్పట్లో ఆర్‌బీఐకి పంపలేకపోయారు. అదేవిధంగా రీ-షెడ్యూల్ చేయాలనీ కోరలేదు. దీంతో రీ-షెడ్యూల్ కాస్తా ఆలస్యమవుతోంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేయబోతున్నాం. సబ్సిడీ తదితర పథకాలను ఆధార్‌కు లింకు చేస్తాం. నిజమైన లబ్ధిదారులకే రుణాలు అందేవిధంగా చూడాలి. సర్వే సందర్భంగా బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ వివరాలను బ్యాంకర్లు కోరితే అందజేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి చెప్పారు.
 
 పత్రికా ప్రకటన ఇవ్వండి..
 కేవలం పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తానని ప్రకటించినప్పటికీ స్వయం సహాయక సంఘాలు కూడా రుణాలు చెల్లిం చడం లేదని బ్యాంకర్లు వాపోయారు. అదేవిధంగా వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న బంగారు రుణాలను కూడా చెల్లించడం లేదని... పైగా వేలం పాటలను వచ్చి అడ్డుకుం టున్నారని సమావేశంలో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌జీలకు మొత్తం రూ. 2,600 కోట్ల రుణాలు ఇవ్వగా, ఇందులో 10 శాతం ఎన్‌పీఏలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పత్రికాప్రకటన ఇవ్వడంతో పాటు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, పీడీలు, ఐకేపీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
 
 తెలంగాణకు ఎస్‌ఎల్‌బీసీ స్టీరింగ్ కమిటీ
 తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. కమిటీ ఏర్పాటుకు ఎస్‌ఎల్‌బీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీలో ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంకు, ఎస్‌బీఐ, డీజీబీ, ఆప్కాబ్‌లతో పాటు వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఉంటారు. రుణమాఫీతో పాటు ఎప్పటికప్పుడు తలెత్తే అంశాలపై చర్చించుకునేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అవసరమని ఎస్‌ఎల్‌బీసీ అభిప్రాయపడింది.  
 
 తెలంగాణలో బ్యాంకుల వివరాలు!
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 4,526 బ్యాంకు శాఖలు ఉన్నాయి. 31 మార్చి 2014 నాటికి గ్రామాల్లో అత్యధికంగా 1,661 శాఖలు ఉండగా మెట్రో ప్రాంతాల్లో వివిధ బ్యాంకులకు చెందిన 1,317 శాఖలు పనిచేస్తున్నాయి.
 
 31 మార్చి 2014 నాటికి వివిధ రంగాలకు బ్యాంకులు ఇచ్చిన అడ్వాన్సులు
* తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో మొత్తం 2,85,879 కోట్ల డిపాజిట్లు ఉండగా... 3,24,964 కోట్ల అడ్వాన్సులున్నాయి.
* మొత్తం ప్రాధాన్యరంగ అడ్వాన్సులు- 1,02,617 కోట్లు
* ఇందులో వ్యవసాయరంగ అడ్వాన్సులు- 49,564 కోట్లు
* వ్యవసాయేతర రంగ అడ్వాన్సులు- 29,301 కోట్లు

మరిన్ని వార్తలు