తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

21 Jan, 2019 08:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పోలీంగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్‌ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్‌ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. 

మొదటిదశలో మొత్తం 4479 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ఉంది. అయితే, అందులో 769 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోర్టు కేసుల కారణంగా 9 పంచాయతీల్లో ఎన్నికలు జరగటం లేదు.  మరోవైపు వార్డు సభ్యుల పరంగా కూడా మొత్తం 39,822 వార్డులకు ఎన్నికలు జరగాలి. అందులో కోర్టు కేసులు, రిజర్వేషన్ల వివాదంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 28,976 వార్డులకు 70,094 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొదట వార్డు సభ్యులకు వచ్చిన ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ విధుల్లో 1,48,033 మంది సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 26వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసే వారికి మధ్య వేలి మీద సిరా గుర్తు వేయనున్నారు. 

మరిన్ని వార్తలు