పాట ఒకటే..భాషే వేరు..

29 Mar, 2018 09:19 IST|Sakshi
కేరళలో తోటి కళాకారులతో...

 కేరళలో మన కళాకారుల ఆటాపాట

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భానంతరం కళాకారులకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని రాష్ట్రాలతో సాంస్కృతిక ఒప్పందాలను భాషా సాంస్కృతిక శాఖ కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల కేరళ క్యాలికట్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు త్రీసూర్‌ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ సారథి కళాకారులను కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది. సారథి కళాకారులు డాక్టర్‌ కుమారస్వామి, గాయకులు యశ్‌పాల్, డప్పు వాద్యకారుడు పెరుమాళ్ల బాబు వెళ్లారు. సదస్సులో మొదటి రోజు డాక్టర్‌ కుమారస్వామి ‘తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధి తీరుతెన్నులు’ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కళాకారులు, కళారూపాలకు ప్రభుత్వం అందించిన చేయూత, రంగస్థల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు సాంస్కృతిక విధాన రూపకల్పనకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు.

మన జానపదాలకు పోలిక..
ఒగ్గు కథ, గౌడ్‌ జెట్టీ కథ, బైండ్ల కథ, చిందు యక్షగానం తదితర కళారూపాలను రేఖామాత్రంగా ప్రదర్శించారు. వీటితో పాటు బతుకమ్మ పాటలు, పీర్ల పాటలు, ఉయ్యాల పాటలు, కోలాటం, నాట్ల పాటలు పాడారు. కేరళ జానపదాలు కొన్ని అక్కడ విన్నప్పుడు అచ్చం మన జానపదాలకు పోలిక  ఉన్నట్లుగా కనిపించింది. ఏ దేశమైనా, ప్రాంతమైనా ప్రజలు పాడుకునే పాటలు, కళారూపాల్లో భావసారూప్యత ఉందని వివరించారు. మూడో రోజు డప్పుదరువులను పెరుమాళ్ల బాబు ప్రదర్శించారు. డప్పు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలా పెనవేసుకుపోయిందో వివరించారు. అన్ని పండుగల్లో డప్పును ఉపయోగిస్తారని, వివాహానికి, హిందూ, ముస్లిం ఐక్యంగా జరుపుకొనే పీర్ల పండుగ నాడు డప్పుతో అసయ్‌ దూల ఆడతారని వివరించారు. హోలీ పండుగనాడు, మారెమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, గ్రామ దేవతలకు డప్పు వాద్యాలతో వేడుకలు జరుపుకొంటారని డప్పు గొప్పతనాన్ని కొనియాడారు. మనిషి అంతిమ యాత్ర, పెళ్లిళ్ల సమయంలోనూ డప్పును వాడతారని వివరించారు. గ్రామాల్లో చాటింపును ఎన్ని రకాలుగా డప్పు వాయించుతారో యశ్‌పాల్‌ డప్పు కొట్టి మరీ చూపించారు.  

మరిన్ని వార్తలు