సంబురంగా ఆవిర్భావం

2 Jun, 2014 23:03 IST|Sakshi

 సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. అమరవీరుల కుటుంబాలు, పోలీస్ సిబ్బంది, మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్‌తోపాటు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీ రాజకుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా, ట్రాఫిక్ డీసీపీ మొహంతి, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన  అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాలి లోకి బెలూన్లు వదిలి రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. మహిళల బతుకమ్మ, కోలా టం ఆడారు. కళాకారుల ఒగ్గుకథ, పీరీల అస్సైదులాలతో సైబరాబాద్ కమిషనరేట్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.  

 అభివృద్ధికి కంకణబద్ధులు కండి..
 29వ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి అందరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. మలిదశ ఉద్యమంలోరంగారెడ్డి జిల్లాలో 16 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థను గౌరవిస్తూనే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు పరిపూర్ణమయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితమై, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుకావాలని కోరారు.

 అమరవీరుల కుటుంబాలకు సన్మానం
 తెలంగాణ రాష్ట్రం కోసం జిల్లాలో అసువులు బాసిన 16 మంది అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా ఉన్నతాధికారులు సన్మానించారు. అమరుల ఆశయాలను కొనసాగించేందుకు కృషిచేస్తామని  అధికారులు పేర్కొన్నారు. వారితోపాటు జిల్లాలోని పలు విభాగాల ఉద్యోగులను సన్మానించారు.

 నోరూరించిన తెలంగాణ వంటకాలు
 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలు నోరూరించాయి. సర్వపిండి, జొన్నరొట్టె, గారెలు, సకినాలు, మడుగుబూలు, గర్జెలు,  నాటుకోడి పులుసు, బెల్లం భక్షాలతోపాటు పలు రకాల వంటకాలను సంబురాల్లో పాల్గొన్న వారికి  వడ్డించారు.

మరిన్ని వార్తలు