సమగ్ర అభివృద్ధే ధ్యేయం

3 Jun, 2019 08:25 IST|Sakshi

కరీంనగర్‌: తెలంగాణ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల ఆకాంక్షలన్నీ నెరవేర్చడంతోపాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఈటల రాజేందర్‌ సందేశమిచ్చారు.

ఐదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న పథకాలను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. కరీంనగర్‌ను త్వరలో వాటర్‌ హబ్‌గా, రైస్‌ బౌల్‌ జిల్లాగా చూడబోనున్నామని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి అందరి మోములో చిరునవ్వును చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బాసటగా నిలువాలని కోరారు. అభివృద్ది, సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకుని బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలన్నారు.
 
రైతు దేశానికే వెన్నెముక..
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతుబం«ధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద 2018–19 సంవత్సరంలో 1,66,270 మంది రైతులకు రూ.231.46 కోట్లు అందించామన్నారు. ఈ సంవత్సరం నుంచి ఎకరాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతు కుటుంబాలకు ధీమాగా ఉండేందుకు రూ.5 లక్షల రైతుబీమా పథకం పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న 18 నుంచి 60 సంవత్సరాలలోపు రైతులందరికీ వర్తింపజేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టామని తెలిపారు. వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని వివరించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. అధిక దిగుబడులు వచ్చే విధంగా బిందు, తుంపర్ల సేద్యానికి రైతులు మొగ్గు చూపారని సూచించారు. పండ్లు, పూల తోటలు పెంచేందుకు 80 శాతం రాయితీ ఇస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకుని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుందని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు చేసి అమలు చేస్తున్నదని, దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. వాతావరణం, భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందో, ఏ పంటల సాగు ద్వారా రైతాంగానికి అధిక లాభాలు వస్తాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భూసార పరీక్షలు, యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తున్నామని, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

తెలంగాణకు హరితహారం..
తెలంగాణకు హరితహరం పథకం ద్వారా ఈ సంవత్సరంలో జిల్లాలో 2.35 కోట్ల  మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు కావల్సిన మొక్కలను నర్సరీలలో అటవీ గ్రామీణాభివృద్ది, ఉద్యానవన శాఖ ద్వారా 2.80 కోట్ల మొక్కలు పెంచుతున్నామని వివరించారు. జిల్లాలో హరితహరం కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 20.88 లక్షలు, రెండవ విడతలో 75.50 లక్షలు, మూడవ విడతలో 79.71 లక్షల మొక్కలు నాటామని తెలిపారు.
 
‘మిషన్‌’తో సత్ఫలితాలు..
చెరువులను పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. జిల్లాలో నాలుగు దశల్లో రూ.318 కోట్లతో 958 చెరువుల çపనులు మంజూరు చేశామని, మిగిలిన చెరువుల పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని వివరించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 11 చెక్‌ డ్యాంలు, కరీంనగర్‌ నియోజకవర్గంలో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.45.43 కోట్లు మంజూరు చేసిందని,  పనులు ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు.

పేద కుటుంబాలకు ‘ఆహార భద్రత’
జిల్లాలో ఇంత వరకు 2,59,320 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని మంత్రి  తెలిపారు. 15,944 కుటుంబాలకు అంత్యోదయ ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని, ఆహార భద్రత పథకంలో ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలలో, పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 66,576 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రతినెలా 438.628 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.

వైద్యంలో మెరుగు..
ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో అభివృద్ధి చేసి పేద రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఈటల రాజేందర్‌ తెలిపారు. పేద రోగులెవరూ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ వైద్య సేవలందించేలా డాక్టర్లను, సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో 20 కోట్లతో నిర్మించిన 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకుని 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తద్వారా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య నెలకు 300 నుంచి 1000కిపైగా జరుగుతున్నాయని వెల్లడించారు.

మాతాశిశు కేంద్రంలో మిడ్‌ వైఫరీ నర్సింగ్‌ కోర్సు దేశంలో మొట్టమొదటి సారిగా ప్రారంభించుకున్నామని, ఇందులో చదువుకునే విద్యార్థులు కూడా గర్భిణులకు వైద్య సేలందిస్తారని తెలిపారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్, వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభించుకున్నామని, 10 పడకలతో ఐసీయు యూనిట్‌ వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్రారంభించామని, త్వరలో మరో రెండు ప్రారంభిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌లో రూ.10 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, జమ్మికుంటలో రూ.5 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మించామని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.10 కోట్లతో మౌలిక వసతులు కల్పించి మరమ్మతులు చేయించామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన బాలింతలకు కేసీటర్‌ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కేసీఆర్‌ కిట్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇంత వరకు 16,231 కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన ఆడపిల్ల తల్లులకు 13 వేలు, మగబిడ్డ తల్లులకు 12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.

రోడ్ల నిర్మాణం..
రోడ్లు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో సింగల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా , డబుల్‌ రోడ్లను ఫోర్‌లైన్‌ రోడ్లుగా అభివృద్ధి చేశామని, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులకు జిల్లాకు 148.30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. పనులన్నీ ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. కమాన్‌ నుంచి సదాశివపల్లి మానేరు నదిపై సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.183 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రగతిలో ఉన్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.73.38 కోట్లు మంజూరయ్యాయని, పనులు నడుస్తున్నాయని వెల్లడించారు.

పంచాయతీరాజ్‌ శాఖకు నిధులు..
పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా జిల్లాలో 2,213 రోడ్ల పనులు, కొత్త తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల మరమ్మతు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.247.66 కోట్లు మంజూరు చేసిందని ఈటల వివరించారు. జిల్లాలో 17 వంతెనల నిర్మాణానికి రూ.31.53 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 12 వ్యవసాయ గోదాముల నిర్మాణానికి రూ.4.8 కోట్లు  ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.9 కోట్లతో 69 కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మంజూరు చేయగా 20 గ్రామపంచాయతీ భవనాలు పూర్తయ్యాయని, మిగతా పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో రూ.7.67 కోట్లతో 8 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అవతరణ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, నగర మేయర్‌ రవీందర్‌సింగ్, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సీపీ వీబీ.కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్‌వో భిక్షానాయక్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రావీణ్య, సీఈవో వెంకటమాధవరావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  

కరీంనగర్‌కు స్మార్ట్, పర్యాటక కళ...

కరీంనగర్‌ స్మార్ట్, పర్యాటక శోభ సంతరించుకోనుందని మంత్రి తెలిపారు. అందమైన సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉజ్వల పార్కు వద్ద రూ.25 కోట్లతో ఐటీ పార్కును, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ఎల్‌ఎండీ దిగువన మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. నగరంలోని కూడళ్లను అభివృద్ధి పరిచి కరీంనగర్‌ నగరాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  

‘ఆసరా’ రెట్టింపు ..
ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకం ప్రవేశపెట్టిందని ఈటల అన్నారు. జిల్లాలో 1,21,851 మందికి ఆసరా ఫించన్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందులో 48,331 మందికి వృద్ధాప్య, 20,277 వికలాంగుల, 34,087 వితంతువులకు, 3,748 గీత కార్మికులకు, 2,806 చేనేత కార్మికులకు, 3,265 ఒంటరి మహిళలకు, 9,337 బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. ఇంతవరకు దివ్యాంగులకు నెలకు రూ.1500 చొప్పున, ఇతరులకు రూ.1000  చొప్పున ఇస్తున్న పింఛన్లను ఈ నెల నుంచి రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా