వైభవంగా అవతరణం

20 May, 2015 01:38 IST|Sakshi
వైభవంగా అవతరణం

వారం రోజులపాటు వేడుకలు
- రూ.కోటి నిధులు విడుదల.. ఉత్తమ అవార్డుల అందజేత
- తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు
- తొలి అవతరణ వేడుకలపై కలెక్టర్ సమీక్ష
హన్మకొండ అర్బన్ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ తొలి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అధికారులు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వారంపాటు రంగు రంగుల విద్యుత్ వెలుగుల్లో ఉండేలా చర్యలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల చేసింది. ఉత్సవాల్లో కాకతీయుల చరిత్రపై కూడా కళాప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాకతీయ పట్నాభివృద్ధి సంస్థ (కుడా), టూరిజం, మహా నగరపాలక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒక్కో పనికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ కోరారు. ఉత్సవాల ఏర్పాట్లుపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝాతో కలిసి కలెక్టర్ వాకాటి కరుణ సమీక్షించారు.

31 నుంచి ఏర్పాట్లు
ఈనెల 31 నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భ వనాలు, కళాశాలలు, విద్యా, వాణిజ్య సంస్థల భవనాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ  చేయాలని క లెక్టర్ కోరారు. పబ్లిక్‌గార్డెన్‌లో కళాప్రదర్శనతోపా టు. జిల్లావ్యాప్తంగా కళాకారుల కళారూపాలు ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానకూడళ్లలో ఫుడ్ కోర్డులు, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు, మ్యూ జికల్ కాన్‌సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. 5కే రన్‌తోపాటు ముగింపు కార్యక్రమాలు జూన్ 7న కనుల పండవగా ఉండేలా ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పనుల నిర్వాహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.

వారం రోజులపాటు...
జిల్లా వ్యాప్తంగా వారంరోజుల పాటు స్థానిక కవులు, కళాకారులతో కార్యక్రమాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఖవ్వాలీలు, గజల్స్, కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు.

సేవా ప్రతిభ అవార్డులు...
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి  ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి కమిటీ ఉత్తములను ఎంపిక చేయనుంది. కమిటీలో జిల్లా మంత్రి, ఉపాధ్యక్షులుగా జెడ్పీ చైర్‌పర్సన్, సభ ్యకన్వీనర్‌గా కలెక్టర్ ఉంటారు. వివిధ శాఖలనుంచి ఈనెల 25లోగా ఉత్తమ ఉద్యోగి, ఉద్యోగినుల పేర్లు జిల్లా కమిటీకి అందజేయాలి. కమిటీ తుదిజాబితా ఖరారు చేస్తుంది. అదేవిధంగా స్వచ్ఛభార త్, హరిత హారం అవార్డులు కూడా  అందజేయనున్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, ఆర్డీఓ మాధవరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్‌రావు, టూరిజం అధికారి శివాజి, ‘కుడా’ అధికారి అజిత్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
రోజువారీ కార్యక్రమాలు...
- జూన్ ఒకటి రాత్రి 10.30 : స్థానిక కళాకారులతో ఉత్సవాలు ప్రారంభం.
- అవతరణకు సూచికగా రాత్రి 11.55 నుంచి 12.10 వరకు అమరవీరుల స్థూపం, కీర్తి స్థూపం వద్ద బాణసంచా పేలుళ్లు.
- జూన్ 2 : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం7.30నుంచి 8.30 మధ్యజాతీయ పతాక ఆవిష్కరణ. అమరవీరుల స్థూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడం, పరేడ్ గ్రౌండ్‌లో ఉపముఖ్యమంత్రి పతాకావిష్కరణ, ఉత్తములకు అవార్డులు, సాంస్కృతిక కార్యక్రమాలు.
- జూన్ 7 : ముగింపు కార్యక్రమాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, సంబరాలు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
 
కవితల పోటీలు...
విద్యారణ్యపురి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ సోషల్‌స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించనున్నట్లు ఆఫోరం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గిరిగాని కృష్ణ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్ధి విభాగాల వారీగా కవితలను ఒక పేజీకి మించకుండా ఈనెల 28తేదీలోపు పోస్టుద్వారా కాకతీయ సోషల్‌స్టడీస్ ఫోరం, ఇంటినెంబర్ 19-10-257, రంగశాయిపేట, వరంగల్ పేర పంపాలని సూచించారు. కేఏఎస్‌ఓఎఫ్‌వో డబ్లూజీఎల్.జిమెయిల్.కామ్ వెబ్‌సైట్‌కు కూడా పంపవచ్చని పేర్కొన్నారు. రెండు విభాగాల నుంచి పది మంది చొప్పున  ఎంపిక చేసి జూన్ 3న  డీఈఓ చేతులమీదుగా వారికి ప్రశంసపత్రాలు, మెమొంటోలను అందజేయనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు