ఉన్నతాధికారిగా తెలంగాణ వాళ్లే ఉండాలి

6 Aug, 2017 01:58 IST|Sakshi
ఉన్నతాధికారిగా తెలంగాణ వాళ్లే ఉండాలి

► ఆంధ్రా ఉద్యోగులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలి
► తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సమావేశంలో తీర్మానించిన నేతలు
► త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌  


సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారి బాధ్యతలు తెలంగాణ అధికారులకే కట్టబెట్టాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం తీర్మానిం చింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను కలసి వివరించనున్నట్లు పేర్కొంది. శనివారం టీజీవో భవన్‌లో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కార్యవర్గ సమావేశం జరిగింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో పదోన్నతుల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. జోనల్‌ వ్యవస్థను రద్దు చేయడం మంచిదేనని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కేడర్లుగా ఏర్పాటు చేయడం ఉద్యోగులకు ప్రయోజ నకరమని చెప్పారు. అయితే నియామకాల విషయంలో స్థానికులకు 90 శాతం అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్‌ లాంటి మారుమూల జిల్లాలో అక్షరాస్యత తక్కువని, దాంతో అక్కడి అభ్యర్థులు అక్షరాస్యతలో ముందువరుసలో ఉన్న జిల్లా అభ్యర్థులతో పోటీ పడలేరని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నియామకాలన్నీ జిల్లా స్థాయి లోనే 90 శాతం స్థానికులతో చేపట్టాలన్నారు.

పోస్టిం గ్‌ విషయంలో మాత్రం రాష్ట్ర క్యాడర్‌ను పరిగణించి ఇవ్వొచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యో గులపై పనిభారం పెరిగిందన్నారు. అదేవిధంగా పదవీ విరమణతో ఖాళీలు పెరిగాయని, ఈ క్రమంలో అర్హులైన ఉద్యోగులం దరికీ పదోన్నతులు ఇచ్చి.. ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచొద్దని కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశామని, వీటిని త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు