‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్‌

15 Dec, 2019 01:41 IST|Sakshi

యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3 లోపు తక్కువ ధరతో విక్రయించేందుకు జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోవాలో ఎన్టీపీసీ నిర్వహించిన దక్షిణాది ప్రాంత వినియోగదారుల సమావేశానికి ప్రభాకర్‌రావు హాజరై ఆ సంస్థ సీఎండీ గురుదీప్‌ సింగ్‌తో చర్చలు జరిపా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం వచ్చే ఏడాది విద్యుత్‌ అవసరాలు భారీగా పెరగనున్నాయని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ సరఫరా చేయాలని ఈ సమావేశంలో గురుదీప్‌కు విజ్ఞప్తి చేశామన్నారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్ల సౌర విద్యు త్‌ విక్రయించేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతుండటంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదనను తగ్గించేందుకు బ్యాకింగ్‌ డౌన్‌ చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులతో సూపర్‌ క్రిటికల్, సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల మధ్య పెద్దగా బేధం లేకుండా పోయిందని ఈ సమావేశంలో సీఎండీ అభిప్రాయపడ్డారన్నారు.

మరిన్ని వార్తలు