మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్‌

12 Feb, 2020 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. కేంద్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2017–18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సమాధానం ఇచ్చిన సందర్భంగా దీనికి సంబందించిన గణాంకాలను వెల్లడించా రు. అంతకుముందు 2016–17లో 4,38,059 హెక్టార్లలో, 2015–16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్క లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018–19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది. గతేడాదికి సంబంధించి లక్ష్యాల సాధన గణాంకాలు ఇంకా సిద్ధం చేయలేదని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర అటవీ శాఖ స్పష్టం చేసింది.

ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. 
మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ రక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యానికి చేరువలో ఉన్నామని, అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా పని చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజున మొక్కను నాటి కానుకగా ఇద్దామని అన్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునివ్వడం ఆదర్శనీయమన్నారు.  

కేసీఆర్‌ బర్త్‌డే రోజున మొక్కలు నాటుదాం: మంత్రి సబిత
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,01,116 మొక్కలు నాటి సంబురాలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సీఎం పుట్టిన రోజున ఆయనకు కానుకగా ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించామని మంత్రి చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వాటి సంరక్షణా బాధ్యతలు కూడా స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయనున్నామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు