కృత్రిమ మేధస్సుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

3 Jan, 2020 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని​ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌)గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 2 గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహీంద్రా ఎకోల్‌ సెంట్రాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(ఎంఈసీ) మధ్య ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఐటీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఎంఈసీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఈ సందర్భంగా మహీంద్రా ఎకోల్‌ సెంట్రాల్‌ డైరక్టర్‌ మేడూరీ యాజులు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ద్వారా యువ పారిశ్రామికవేత్తలు మరింత ఎదగడానికి మేం చేస్తున్న కృషికి తోడు ఇప్పుడు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై మరింత నైపుణ్యం పెంపొందించేలా సూపర్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ పరికరాలతో పాటు, కొత్తగా ఏర్పాటు ఏఐ స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చే విధంగా రూపొందించనున్నామని స్పష్టం చేశారు.  పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుపై  స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 

కాగా, మహీంద్రా ఎకోల్ సెంట్రాల్ తన సూపర్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆగస్టు 2019 లో ప్రారంభించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్‌ వంటి పలు ప్రాజెక్టులపై పనిచేస్తోంది. వేగవంతమైన కంప్యూటింగ్ పనితీరు , డీప్ లెర్నింగ్ అండ్‌ అనలిటిక్స్, మల్టీ-డిసిప్లినరీ ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్ కోసం ఒక బలమైన వేదికను అందించడానికి ఎంఈసీ సంస్థ సూపర్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు