గంగాధర్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం

9 Sep, 2014 10:50 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద అర్థరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవార ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆరు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే బోయినపల్లి వద్ద  డీసీఎం వ్యాన్ - ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి కిందకి దిగిపోగా, బస్సు క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమైయ్యాడు. మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు అగ్నిపమాక సిబ్బందికి సమాచారం అందించారు.

మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అర్పివేశారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు