వైద్య అడ్మిషన్ల గడువు పెంచాలి!

3 Aug, 2016 01:50 IST|Sakshi

సుప్రీంకోర్టును ఆశ్రయించాలని
 రాష్ట్ర ప్రభుత్వం యోచన

 
 
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువును మరింత పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 నిర్వహించనున్న ప్రభుత్వం అదే నెల 20కల్లా ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే వైద్య ప్రవేశాల ప్రక్రియను దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి ఈ సమయం ఏమాత్రం సరిపోదు. ర్యాంకులు ప్రకటించాక సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ తదితర ప్రక్రియకు దాదాపు నెల సమయం పట్టనుంది. అందువల్ల అక్టోబర్ 20 వరకు ప్రవేశాల గడువు పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు.ఆ సమయం సరిపోతుందా లేదా అనే అంశంపై ఎంసీఐ తర్జనభర్జన పడుతోంది.

ఒకవేళ ఎంసీఐ కొంత గడువు పెంచితే ఆ సమయంలో రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ముగించవచ్చా? లేకుంటే ఇంకా అదనపు సమయం కోరాలా? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమయం సరిపోకపోతే గడువు పెంచాలంటూ ముందుగా ఎంసీఐకి విన్నవించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు భావిస్తున్నారు. అయితే ఎంసీఐ ఒప్పుకునే అవకాశాలుండవని... సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు. ‘సెప్టెంబర్ 30కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించాల్సి ఉంది. నీట్-1, 2 నిర్వహించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల ముగింపు గడువు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తేదీ ప్రకటించాక మనకు సమయం సరిపోతుందో లేదో చూడాలి. ఆ తర్వాతే దీనిపై ఎలా వ్యవహరించాలో పరిశీలిస్తాం’ అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.

>
మరిన్ని వార్తలు