3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం

17 May, 2020 05:02 IST|Sakshi

మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ నుంచి రాష్ట్రంలోకి నో ఎంట్రీ

మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసిన ప్రభుత్వం

ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటమే కారణం

తదుపరి ఆదేశాలిచ్చే వరకు పాసులు జారీ చేయొద్దని సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. శనివారం నాటికి మహారాష్ట్రలో 29,100 మందికి కరోనా సోకగా, 1,068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లో 9,931 మందికి కరోనా సోకగా, 606 మంది మరణించారు.

కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న వారికి పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పొరుగునే ఉన్న ఏపీలో 2,307 మందికి కరోనా సోకగా, 48 మంది మృతి చెందారు. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

80 వేల మంది రాక
కరోనా వైరస్‌ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. స్వరాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు పాసులు జారీ చేసేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం 24 గంటల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది. ఇందులో 100 మంది అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్‌ రూం ద్వారా 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఒక్కో పాస్‌ ద్వారా ముగ్గురు, నలుగురు వ్యక్తులకు సైతం అనుమతిస్తున్నారు. కంట్రోల్‌ రూం నంబర్లు(040–23450624)లకు రోజూ 2 వేల కాల్స్‌ వస్తుండగా, రోజుకు సగటున 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్‌ కోసం కాల్‌ చేసిన వ్యక్తులు తెలంగాణవాసులేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న విషయాలను రుజువు చేసుకున్న తర్వాతే వాట్సాప్‌ ద్వారా పాసులు జారీ చేస్తున్నారు.

స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వ్యక్తుల పేర్లు, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఈ పాసులు జారీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రానికి తిరిగి వచ్చే వారిని రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆపి జ్వరం, జలుబు, ఇతర లక్షణాల కోసం స్క్రీనింగ్‌ చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలుంటే వారిని తిప్పి పంపేస్తున్నారు. లక్షణాలు లేని వారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్‌ ముద్ర వేసి ఇంటికి పంపుతున్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు మాత్రమే సచివాలయంలోని కాల్‌సెంటర్‌ పని చేస్తుండగా, తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకుంటున్న వారు సైతం అవగాహన లేక కాల్స్‌ చేస్తున్నారు. ఇలాంటి వారికి స్థానిక పోలీసు స్టేషన్లలో పాసులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు