బిల్డర్లూ.. పారాహుషార్‌

17 Jun, 2019 01:23 IST|Sakshi

సౌకర్యాలు కల్పించకుంటే బ్లాక్‌లిస్టే

కొత్త మున్సిపల్‌ చట్టంలో లే అవుట్లపై కఠిన నిబంధనలు

బిల్డర్లు, అధికారులను బాధ్యులను చేసేలా ముసాయిదా రూపకల్పన

డాక్యుమెంట్లు సమర్పించాక భవన నిర్మాణ అనుమతులకు గడువు వారమే

ఆలోగా తేల్చకుంటే అనుమతి ఇచ్చినట్లే.. అధికారులపైనా చర్యలు

200 చ.మీ.లోపు స్థలంలో భవన నిర్మాణానికి ఇక సెల్ఫ్‌ డిక్లరేషనే  

సాక్షి, హైదరాబాద్‌ : భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త మున్సిపల్‌ చట్టంలో కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా లే అవుట్ల విషయంలో బిల్డర్లు, అధికారులను బాధ్యులను చేసేలా ముసాయిదా మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. లే అవుట్లు చేశాక ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్ముకొని సొమ్ము చేసుకొనే బిల్డర్లు ఆయా లే అవుట్లను గాలికి వదిలేస్తే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా నిబంధనలు తయారవుతున్నాయి. లే అవుట్‌ ఆమోదం పొందిన రెండేళ్లలో కనీస సౌకర్యాలను కల్పించి సంబంధిత ఆధారాలను ఆన్‌లైన్‌లో పొందుపరచకుంటే ఆ బిల్డర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి లే అవుట్లు వేయకుండా అనర్హులుగా ప్రకటించేలా కఠిన నిబంధనలతో చట్టాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

భవన నిర్మాణాల విషయంలోనూ నిర్మాణదారులు, అధికారులను జవాబుదారీలను చేయడంతోపాటు నిర్మాణదారులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు రూపొందుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం రోజుల్లోగా అనుమతి ఇచ్చేదీ లేనిది తేల్చేయాలనే నిబంధనను పొందుపరచనున్నారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాలనుకుంటే ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణాలను వివరిస్తూ అధికారులు లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని లేదంటే అనుమతి ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొననున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న నిబంధనలకు కొంత మార్పు చేసి 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవనం నిర్మించాలనుకుంటే గతంలోలాగా అనుమతులు అవసరం లేదని, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సరిపోతుందని, దరఖాస్తుదారుల స్వయం పూచీకత్తుతో భవనాలు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుందని కొత్త చట్టంలో పేర్కొంటున్నారు. 
భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాల విషయంలో ముసాయిదా చట్టంలో పేర్కొంటున్న ముఖ్యాంశాలివే... 
1. లే అవుట్లకు సంబంధించి... 

  • చట్టంలో పేర్కొన్న విధంగా లే అవుట్ల అనుమతి కోసం సదరు లే అవుట్‌లో కల్పించనున్న మౌలిక సదుపాయాలను వివరిస్తూ ఆన్‌లైన్‌లో లేదా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • ఆ లేఅవుట్‌ను అనుమతిస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ లే అవుట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అధికారులు ఉంచాలి. 
  • లే అవుట్‌ అనుమతులను నిర్దేశిత సమయంలో ఇవ్వలేకపోయిన పక్షంలో బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. 
  • అనుమతి పొందిన లే అవుట్లలో రెండేళ్లలో డెవలపర్‌ లేదా బిల్డర్‌ కనీస సౌకర్యాలు కల్పించి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. లేదంటే సదరు డెవలపర్‌ లేదా బిల్డర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి లే అవుట్లు చేపట్టకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. 
  • లే అవుట్‌లో పార్కులు, గ్రీన్‌బెల్ట్, ఆట స్థలాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఉచితంగా మున్సిపాలిటీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులు స్పష్టమైన రికార్డు నిర్వహించాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం కేటాయించిన ఖాళీ స్థలాల్లో మళ్లీ క్రయవిక్రయ లావాదేవీలు నిర్వహిస్తే జరిమానా విధించడంతోపాటు మూడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 

2. వన నిర్మాణాలకు సంబంధించి... 

  • కమిషనర్‌ లేదా వైస్‌ చైర్‌పర్సన్‌ అనుమతి లేకుండా భవన నిర్మాణాల కోసం ఎలాంటి భూమిని వినియోగించకూడదు. అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించకూడదు. 
  • 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవన నిర్మాణానికిగాను ఆన్‌లైన్‌లో సదరు యజమాని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు అన్ని డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో సమర్పించిన వెంటనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 
  • ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో వారం రోజుల్లోగా సదరు యజమానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అలా చేయకుండా సదరు దరఖాస్తుపై వారం రోజుల్లోగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. 
  • 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో భవన నిర్మాణానికి ఇచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌కు సదరు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్‌ ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ అవసరం ఉండదు.  
  • భవన నిర్మాణానికి అనుమతి వచ్చిన 18 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇస్తారు.  
  • ఒకవేళ నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయకపోతే ఆ భవనానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
  • కొత్తగా నిర్మించే భవనాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సంఖ్యలో చెట్లు నాటాలి. అన్ని భవనాల్లో పార్కింగ్‌ స్థలాలను ఉంచాలి. అక్కడ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ చార్జింగ్‌ సదుపాయం కల్పించాలి.  
  • భవన నిర్మాణ సమయంలో ఎవరైనా మరణిస్తే నిర్మాణాన్ని నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.  
మరిన్ని వార్తలు