రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు 

31 Mar, 2020 02:47 IST|Sakshi

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.9,747.30 కోట్లు

మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు రూ.11,710.70 కోట్లు

17, 18 వరకు టెండర్లకు అవకాశం.. 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీటిని తరలించేలా పంప్‌హౌస్‌లు, కాల్వలు, రిజర్వాయర్‌లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.

ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్‌ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్‌ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్‌బే, వెలగటూరు వద్ద మొదటి పంప్‌హౌస్‌ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్‌ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్‌ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్‌హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్‌ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్‌ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్‌ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్‌లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్‌ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్‌ 17 వరకు టెండర్‌లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్‌ బిడ్‌ తెరవనున్నారు. 

మరిన్ని వార్తలు