మల్లన్న నుంచే సింగూరుకు గోదారి!

13 Mar, 2020 04:28 IST|Sakshi

గతంలో కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ ద్వారా సింగూరుకు తరలించాలన్న ప్రతిపాదన వెనక్కి

పాత ప్యాకేజీ–17, 18, 19 కొనసాగింపునకు సీఎం నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధత తొలగింది. కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నుంచే నీటిని గతంలో ప్రతిపాదించిన మాదిరి సింగూరుకు గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో సింగూరుకు తరలించేలా చేపట్టిన పనులను తిరిగి ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో గత కొన్నేళ్లుగా ఆగిన ప్యాకేజీ–17, 18, 19 పనులు తిరిగి ఆరంభమయ్యాయి.

విద్యుత్, భూసేకరణ ఖర్చులు ఆదా.. 
మల్లన్న సాగర్‌ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించే ప్రక్రియను గతంలోనే చేపట్టారు. మల్లన్న సాగర్‌లో నీటిని తీసుకునే లెవల్‌ 557 మీటర్లు ఉండగా, సింగూరు లెవల్‌ 530 మీటర్లు ఉంది. గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18 కి.మీల టన్నెల్‌ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం మూడేళ్ల కింద నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్‌ నుంచి 530 మీటర్ల లెవల్‌ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి దీనికి అనుగుణంగా ప్రణాళికలు వేసింది.

అయితే కొండపోచమ్మ ద్వారా నీటిని తరలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్‌ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్‌–65ని కూడా దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.5 కోట్లకు పైగా ఉండటంతో భూసేకరణ భారం కానుంది. అదీగాక కొండపోచమ్మ సాగర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపు అనుకున్న మేర సరఫరా చేయడం సాధ్యం కాదు. దీనికి బదులు మల్లన్న సాగర్‌ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు తరలిస్తే మేలని ప్రభుత్వం ఇటీవల ఇంజనీర్లతో జరిపిన చర్చల సందర్భంగా తేల్చింది.

విద్యుత్‌ ఖర్చు రూ.67 కోట్లు.. 
మల్లన్న సాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్‌ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే ఉంటుందని, అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవసరం ఉంటుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు సైతం తేల్చి చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే సేకరించిన భూమి అవసరాలపై వెచ్చించిన రూ.500 కోట్లు మేర ఆదా ఉంటుందని తెలిపారు. దీంతో ఏకీభవించిన ముఖ్యమంత్రి మల్లన్న సాగర్‌ ద్వారానే సింగూరుకు నీటిని తరలించాలని సూచించారు. దీంతో ఇప్పుడిప్పుడే మూడు ప్యాకేజీల పనులను ఏజెన్సీలు తిరిగి ఆరంభించాయి.

మరిన్ని వార్తలు