కేన్సర్‌పై పరిశోధనకు ‘ఈపీఆర్‌ జీన్‌ టెక్నాలజీ’  

22 Aug, 2018 03:10 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న ఎ.రామచంద్రారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌పై పరిశోధన, మందుల తయారీవంటి అంశాలపై ‘ఈపీఆర్‌ జీన్‌ టెక్నాలజీ’కంపెనీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చి ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) ఆధ్వర్యంలో మంగళవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో పలు కంపెనీలను ఎంపిక చేశారు. కేన్సర్‌పై పరిశోధన, దాని నివారణకు ‘రిచ్‌’ఆహ్వానం మేరకు 60 కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. అందులో ఆరింటిని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఈపీఆర్‌ జీన్‌ టెక్నాలజీ ఒకటి.

ఈపీఆర్‌ జీన్‌ టెక్నాలజీ ఇప్పటికే కేన్సర్‌పై పరిశోధన పూర్తి చేసింది. అందుకుగాను ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు బహూకరించింది. అవార్డును సైంటిఫిక్‌ అడ్వైజర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ అర్జుల రామచంద్రారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే తాము అమెరికాలోనూ, ఇండియాలోనూ కేన్సర్‌ నివారణకు పరిశోధనలు పూర్తి చేసి మందును కనుగొన్నామన్నారు. ఈ మందుకు రెండు దేశాల్లోనూ అనుమతి కావాల్సి ఉందని, క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే మందు తయారీకి భారత్‌లో అనుమతి కూడా అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం తమ కంపెనీ ప్రతిపాదనను ఎంపిక చేయ డం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు