కృష్ణా, గోదావరిపై చెక్‌డ్యాంలు

5 Feb, 2019 02:31 IST|Sakshi

ఎక్కడికక్కడ నీటి కట్టడికి నీటిపారుదల శాఖ నిర్ణయం

సీఎం ఆదేశాల మేరకు వర్క్‌షాప్‌ నిర్వహించిన ఇంజనీర్లు

త్వరలో మార్గదర్శకాలు విడుదల  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. దీంతో ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేసి వీలున్నంత మేర ఎక్కువ జలాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని నదులు, వాగుల పునరుజ్జీవం కోసం అనువైన చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాలని, ఇందుకు అవసరమైన సాంకేతికాంశాలను పరిశీలించి అంచ నా వ్యయంతో నివేదికను తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ గతంలో నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రిటైర్డ్‌ ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్‌ నేతృత్వంలోని బృందం పలు అంశాలను అధ్యయనం చేసింది. ఆ అంశాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజనీర్లకు వివరించడానికి సోమవారం జలసౌధలో ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

రాష్ట్రస్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారులకు వరకు హాజరైన ఈ వర్క్‌షాప్‌లో లక్ష్యాలను, సీఎం సూచనలను ఇంజనీర్లకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. అనంతరం వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ ఇంజనీర్లనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైందని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక చాలా కాలం క్రితమే ప్రధాన నదులు, వాటి ఉపనదులపై చెక్‌డ్యాంలు, ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాయని తెలిపారు. జహీరాబాద్‌ ప్రాంతంలోని గొట్టిగానిపల్లె గ్రామంలో ఉన్న ఒకే ఒక్క వాగుపై 12 చెక్‌డ్యాంలు నిర్మించారని, దీంతో గ్రామంలో నీటి వనరుల లభ్యత పెరిగి ఏటా 2 పంటలు పండిస్తున్నారని తెలిపారు.

 
మ్యాప్‌ల ద్వారా వివరణ: రిటైర్డ్‌ ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్‌ తన అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఇంజనీర్లకు వివరించారు. చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఎంపిక చేయాల్సిన వాగులను ఎలా గుర్తించాలి, అందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ రూపొందించిన మ్యాప్‌ల ద్వారా వాగుల ఎంపికపై చర్చించారు. రాష్ట్రంలోని నదులు, వాగులను మొత్తం 8 స్థాయిల్లో వర్గీకరించామని, నదులు, ఉపనదులు, వాగుల సామర్థ్యాలను బట్టి చెక్‌డ్యాంల నిర్మాణానికి 4 లేదా ఆపైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. గోదావరి బేసిన్‌లోని 6,500 కిలోమీటర్ల పొడవులో ఇప్పటికే ఆనకట్టలు, చెక్‌డ్యాంలు, కత్వా లు, బంధాలు మొత్తం కలిపి 319 ఉన్నాయని, కృష్ణా బేసిన్‌లోని 5,700 కిలోమీటర్ల పొడవున్న వాగులపై 466 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా చిన్నస్థాయి వాగులపై ఉన్నాయని, పెద్ద వాగులపై ఇప్పుడు చెక్‌డ్యాంలు నిర్మించే అవకాశం ఉందన్నారు. మంచి రాతి పునాది గల స్థలాలను ఎంపిక చేయాలన్నారు. చెక్‌డ్యాంల ప్రతిపాదనలలో మొదటి నుంచీ భూగర్భ జలశాఖతో టచ్‌లో ఉండాలని సూచించారు. 3 మీటర్ల లోతున జలం అందుబాటులో ఉంటే అక్కడ చెక్‌డ్యాంలను ప్రతిపాదించవద్దని చెప్పారు. ఇప్పటికే విధ్వంసానికి గురైన గ్రామాలకు ప్రాధాన్యం కల్పించాలని భూగర్భ జల శాఖ డైరెక్టర్‌ పండిత్‌ సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో వోఎస్డీ శ్రీధర్‌ రావు దేశ్‌పాండే, మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు