పరిశ్రమలకు పాక్షిక సబ్సిడీలు

6 Jul, 2020 04:02 IST|Sakshi

బకాయిల్లో పావు వంతు విడుదలకు ప్రభుత్వ నిర్ణయం

ఆర్థిక శాఖ పరిశీలనలో ప్రతిపాదన, త్వరలో ఆమోదం

ఏళ్ల తరబడి పెండింగ్‌లో రూ. 2,500 కోట్ల సబ్సిడీలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ మూలంగా తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవాలని పారిశ్రామికవర్గాల నుంచి వినతులు అందిన నేపథ్యంలో దాదాపు రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశానికి సంబంధించి పరిశ్రమల శాఖ ఇదివరకే ప్రతిపాదనలు సమర్పించింది.

పావు వంతు చెల్లింపు.... 
పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాల కింద సుమారు రూ. 2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ. 600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. బకాయిల చెల్లింపునకు 2020–21 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో పేర్కొన్న బకాయిల మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలు గతంలోనే పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో దశలవారీగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ బకాయిల్లో పావు వంతును తక్షణమే విడుదల చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉండగా నేడో, రేపో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ చార్జీలపైనా నిర్ణయం? 
లాక్‌డౌన్‌ మూలంగా మార్చి నుంచి మే వరకు మూడు నెలలపాటు పరిశ్రమల విద్యుత్‌ బిల్లులపై మారటోరియం విధించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రూ. 130 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ చార్జీలు రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతోపాటు ఆస్తి పన్ను రద్దు చేసే యోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు రుణాలు అందేలా చూడాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. త్వరలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి ఈ అంశంపై సమీక్షించే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు