న్యూ ఇయర్‌ ‘షాక్‌’

24 Dec, 2019 03:58 IST|Sakshi

ఈవెంట్ల నిర్వహణకు భారీ వడ్డన నిర్ణయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

టికెట్ల ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఎక్సైజ్‌ ఫీజు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈవెంట్ల నిర్వహణ కోసం ఎక్సైజ్‌ ఫీజు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈవెంట్లను నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోన్న తరుణంలో గతంలో ఉన్న ఈవెంట్ల ఫీజును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఉన్న ఫీజును రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచినట్టు ఎక్సైజ్‌ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెంచిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్త ర్వులు వచ్చేంతవరకు ఇవి అమల్లో ఉంటా యని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు.

గతంలో రూ.9 వేలే... 
వాస్తవానికి గతంలో ఈవెంట్ల నిర్వహణకు చాలా తక్కువగా ఎక్సైజ్‌ ఫీజు వసూలు చేసేవారు. ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య, ఇతర అంశాలతో సంబంధం లేకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే రూ.9 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.4,500 ఎక్సైజ్‌ ఫీజు కింద వసూలు చేసేవారు. అంటే ఈవెంట్లలో మద్యం సరఫరా అనుమతికి గాను ఈ ఫీజు తీసుకునేవారు. కానీ, చాలాకాలంగా ఈ ఫీజును సవరించకపోవడం, ఈవెంట్ల నిర్వహణ ఖరీదు కావడంతో ఫీజును పెంచాలని రెండు నెలల క్రితం ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు సాధారణ ఈవెంట్ల నిర్వహణకు గాను జీహెచ్‌ఎంసీ పరిధిలో.. రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. అదే స్టార్‌ హోటళ్లలో ఈవెంట్లను నిర్వహిస్తే దాన్ని రూ.9 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. ఇక జీహెచ్‌ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో.. సాధారణ ఈవెంట్లకు రూ.4,500 నుంచి రూ.9 వేలకు, స్టార్‌హోటళ్లలో అయితే రూ.4,500 నుంచి రూ.12వేలకు ఎక్సైజ్‌ ఫీజు పెంచారు.

వాణిజ్య, క్రీడా ఈవెంట్లకు భారీ వడ్డన...
హైదరాబాద్‌ పరిధిలో న్యూఇయర్‌తో పాటు పలు సందర్భాలను పురస్కరించుకుని నిర్వహించే ఈవెంట్లలో మందు సరఫరా అనుమతికి గాను కట్టాల్సిన ఫీజు కూడా గతంలో రూ.9 వేలే ఉండేది. ఇప్పుడు ఆ ఫీజును ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య ఆధారంగా ఎక్సైజ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కనీసం 1000 మంది హాజరయ్యే ఈవెంట్లలో మందు సరఫరా కోసం రూ.50 వేలు, 5 వేల మందిలోపు హాజరయ్యే ఈవెంట్లకు రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ మంది హాజరయితే రూ.2.5 లక్షలు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక నుంచి హైదరాబాద్‌లో జరిగే వాణిజ్య ఈవెంట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే అక్కడ లిక్కర్‌ సరఫరాకు గాను గతంలో రూ.9 వేలు చెల్లించేవారు. కానీ మారిన నిబంధనల ఇప్పుడు రూ.2.5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు