రోడ్డెక్కుతున్న బస్సు

19 May, 2020 05:20 IST|Sakshi

నేటి ఉదయం 6 నుంచి స్టార్ట్‌

తిరగనున్న అన్ని కేటగిరీల సర్వీసులు

నిలబడి ప్రయాణించేందుకు ‘నో’

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 రోజుల విరామం తర్వాత మళ్లీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ బస్సులు నడుపుకొనేం దుకు ప్రభుత్వం అనుమతినివ్వటంతో ఆర్టీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభం అవుతున్నాయి.

నగరం బయటి నుంచే రాకపోకలు
హైదరాబాద్‌ సిటీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నగరంలో బస్సులు తిప్పొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సిటీ సర్వీసులు ప్రారంభించటం లేదు. అదే కోవలో జిల్లా సర్వీసులను కూడా సిటీలోకి అనుమతించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సిటీ వెలుపలే బస్సులు నిలిచిపోతాయి. అక్కడి నుంచి ప్రయాణికులు ఇతర ప్రైవేటు లేదా సొంత వాహనాల్లో ఇళ్లకు చేరాల్సి ఉంటుంది. 
► నల్లగొండ – విజయవాడ హైవే మీదుగా వచ్చే బస్సులను హయత్‌నగర్‌ వద్దే నిలిపేస్తారు. వాటిని దిల్‌సుఖ్‌నగర్‌ వరకు అనుమతించాలన్న విన్నపాన్ని ప్రభుత్వం కొట్టిపడేసింది. 
► వరంగల్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ కూ డలి వద్ద నిలుస్తాయి. 
► దేవరకొండ వైపు నుంచి వచ్చేవి ఇబ్రహీంపట్నం వరకే నడుస్తాయి. 
► వికారాబాద్‌ వైపు నుంచి వచ్చేవి ‘అప్పా’ జంక్షన్‌ వద్ద ఆగిపోతాయి. 
► కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి వచ్చేవి జూబ్లీ బస్టేషన్‌ వరకు వస్తాయి. 
► ఇమ్లీబన్‌ బస్టాండులోకి బస్సులను అనుమతించరు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, మినీ బస్సులన్నింటినీ నడుపుతారు. రాష్ట్రం లోపలే అన్ని జిల్లాలకు ఈ బస్సులు తిరుగుతాయి. 

దూరం.. దూరం
కరోనా నిబంధన ల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ ప్ర యాణికులను తరలిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించబోమని వెల్లడించారు. తొలుత భౌతిక దూరంలో భాగంగా రెండు సీట్ల వరసలో ఒకరిని, మూడు సీట్ల వరసలో ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమకు అలాంటి ఆదేశాలు ఏవీ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంటే.. అన్ని సీట్లలో ప్రయాణికులను అనుతిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదేమాట అధికారులను అడిగితే.. భౌతికదూరం పాటిస్తామని మాత్రమే చెబుతున్నారు, సీట్ల మధ్య దూరం ఏర్పాటు గాని, కొన్ని సీట్లను ఖాళీగా ఉంచే ఆలోచన కానీ ఉందా అంటే సమాధానం దాటవేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని బస్సు ఎక్కాలని, నిలబడేందుకు మాత్రం అనుమతించమని పేర్కొంటున్నారు. ప్రయాణికులు కచ్చితంగా మాస్కు ధరించాలి. వారు లోనికి ఎక్కగానే కండక్టర్‌ వద్ద ఉండే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు ప్రయాణికులు దూరందూరంగా ఉండాలి. ప్రయాణ సమయంలో మాస్కు తొలగించొద్దు.. వంటి నిబంధనలపై ప్రయాణికులకు ముందే సూచనలు చేయనున్నారు. మధ్యలో చెకింగ్‌ సిబ్బంది వచ్చే సమయంలో వీటిని ఉల్లంఘిస్తూ దొరికిన ప్రయాణికులకు ఫైన్‌ విధించనున్నారు. మాస్కు లేకుంటే రూ.వేయి జరిమానా ఇక్కడా వర్తిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు