వచ్చే ఐదేళ్లు.. రూ.2 లక్షల కోట్లు

22 Dec, 2019 02:43 IST|Sakshi

సాగునీటి రంగంపై వెచ్చించనున్న నిధులు

అవసరాలు, అంచనాలతో రాష్ట్రం సమగ్ర నివేదిక

కేంద్ర ఆర్థికశాఖ, ‘నీతి ఆయోగ్‌’కు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి రంగాన్ని ఉరకలెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు భారీగా నిధులు వెచ్చించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేస్తూనే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రక్రియను పరుగులు పెట్టించనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.40 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర ఖర్చు చేయనుంది. దేశంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తన బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా రూ.100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడం కోసం ఆర్థిక శాఖ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయగా దానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించింది. ఐదేళ్ల వ్యవధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్న నిధుల వివరాల్ని అందులో పేర్కొంది.

మొదట ప్రాజెక్టులు.. ఆపై అనుసంధానం
కృష్ణా, గోదావరి నదీజలాల పూర్తి వినియోగానికి వీలుగా ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటితోపాటే నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. వీటి నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మినహాయిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సాగునీటి రంగంపై రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేర నిధులను ఖర్చు చేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు పంపిన నివేదికలో తెలిపింది.

ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని, పాలమూరు–రంగారెడ్డికీ ఇలాగే నిధులు వెచ్చిస్తామని, నదుల అనుసంధానంతో సహా మొత్తంగా వచ్చే ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.2 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 2023–24 నాటికి కొత్తగా చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తవుతాయని, ఆపై నిధుల ఖర్చంతా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంపైనేనని వెల్లడించింది.
టాస్క్‌ఫోర్స్‌కు ఎందుకీ ఐదేళ్ల ప్రణాళిక?
కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రూ.100 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో చేపట్టా్టల్సిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చైర్మన్‌ కాగా, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. 

2019–20 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం దాకా చేపట్టాల్సిన కార్యాచరణను టాస్క్‌ఫోర్స్‌ తన నివేదికలో పొందుపరుస్తుంది. దీనికోసం మౌలిక వసతుల రంగంలో ఖర్చుచేసే నిధుల వివరాలివ్వాలని టాస్క్‌ఫోర్స్‌ ఆయా రాష్ట్రాలను కోరింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ శాఖల ఐదేళ్ల ప్రణాళికల వివరాలను సేకరించి కేంద్రానికి సమర్పించింది. దీని ఆధారంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల సడలింపు, కేంద్రసంస్థల నుంచి ఆర్థిక సాయం, రుణ సేకరణ అవకాశాలు వంటివి కేంద్రం పరిశీలిస్తుంది.

మరిన్ని వార్తలు