రాసి మూసేసి!

29 Dec, 2018 10:46 IST|Sakshi

మూసీ సుందరీకరణ పనులపై మీనమేషాలు

తొలి విడత పనులు ఇప్పటికీ ప్రారంభం కాని వైనం..

పురానాపూల్‌– చాదర్‌ఘాట్‌ మార్గలో డిజైన్ల ఎంపికపై తేల్చని మూసీ కార్పొరేషన్‌  

నీరుగారుతోన్న సర్కారు లక్ష్యం

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది ప్రక్షాళన పనులు ఒక్క అడుగూ ముందుకు సాగడం లేదు. తొలివిడతలో ప్రతిపాదించిన పనులు కాగితాలకే పరిమితం అయ్యాయి. పురానాపూల్‌–చాదర్‌ఘాట్‌(3 కి.మీ) మార్గంలో సుందరీకరణ చేపడతామని చెప్పిన అధికారులు...చివరకు డిజైన్ల అంశాన్నే తేల్చలేకపోయారు. మూసీ చుట్టూ ఆకాశ మార్గాల నిర్మాణం, నది ప్రవాహ మార్గంలో తీరైన ఉద్యానవనాలు ఏర్పాటు తదితర బ్యూటిఫికేషన్‌ పనులు చేపట్టేందుకు వీలుగా  పది స్వదేశీ, విదేశీ సంస్థలు ఆరునెలల క్రితమే అవసరమైన డిజైన్లను సమర్పించినప్పటికీ అడుగు ముందుకు పడడంలేదు. మూసీనది పడమర భాగంలో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లతోపాటు తూర్పున ఉన్న గౌరెల్లి (ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపం)వరకు సుమారు 57.50 కి.మీ మార్గంలో సుందరీకరణ, పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అంతర్జాతీయ స్థాయి డిజైన్‌ సంస్థలను ఆహ్వానించిన విషయం విదితమే. ప్రపంచస్థాయి ప్రమాణాలు, వినూత్న విధానాల ద్వారా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పట్టాలెక్కకపోవడం పట్ల నగరవాసులు, పర్యావరణ వాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  

ఆచరణలో ఆమడదూరం...
తీరైన పట్టణ ప్రణాళిక, సుందరీకరణ అంశాల్లో పేరొందిన ప్రతిష్టాత్మక సంస్థలు పురానాపూల్‌–చాదర్‌ఘాట్‌ మార్గంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు గాను మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గతంలో డిజైన్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. దీంతో అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు తాము రూపొందించిన డిజైన్లను కార్పొరేషన్‌కు సమర్పించాయి. ఇందులో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేయడంలో ఆరునెలలుగా మూసీ కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.  

ఘన చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా సుందరీకరించాల్సిందే..
మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీలో ఆవరణ వ్యవస్థను పరిరక్షించడం,హైదరాబాద్‌ నగర చరిత్ర,సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ అభివృద్ధి పనులకు తక్షణం శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని పర్యావరణ వాదులు కోరుతున్నారు. ఇందుకోసం ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ హైదరాబాద్‌:మూసీ రివర్‌ రివిటలైజేషన్‌’ పేరుతో నిర్వహించిన డిజైన్‌ కాంపిటీషన్‌లో వివిధ సంస్థలు సమర్పించిన డిజైన్లలో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపికచేయాలని సూచిస్తున్నారు.  

మూసీ సుందరీకరణ పనుల డిజైన్లు రూపొందించిన స్వదేశీ, విదేశీ కంపెనీలివే...  
1.ట్యూరెన్‌స్కేప్, చైనా
2.ఎకో సిస్టం డిజైన్, యూఎస్‌ఏ
3.హెన్నింగ్‌ లార్సెన్, డెన్మార్క్‌
4.వావ్‌ డిజైన్‌ స్టూడియో, సింగపూర్‌
5.ఆరూప్‌ ఇంటర్నేషనల్‌ యూకె ఇండియా
6.స్పేస్‌ మ్యాటర్స్‌ అండ్‌ స్నోహెట,నార్వేఇండియా
7.సుర్భానా జురోంగ్‌ సింగపూర్‌ ఇండియా
8.హఫీజ్‌ కాంట్రాక్టర్, ముంబయి
9.హెచ్‌సీపీ డిజైన్, అహ్మదాబాద్‌
10.అనగ్రామ్‌ ఆర్కిటెక్టŠస్, ఢిల్లీ

నీరుగారుతోన్న లక్ష్యం..
ఇక అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి పురానాపూల్‌–చాదర్‌ఘాట్‌ మార్గంలో డిసెంబరు నెలలో సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లు ఏర్పాటుచేసే పనులను ప్రారంభించాలని గతంలో లక్ష్యం నిర్దేశించారు. 2019 ఏప్రిల్‌ నాటికి ఈ పనులు పూర్తిచేసి ప్రజల సందర్శనకు వీలుగా ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికీ అడుగు ముందుకుపడడంలేదు. 

అధికారుల మాట ఇదీ..
మూసీ ప్రవాహ మార్గంలో 57.50 కి.మీ మార్గంలో ఈస్ట్‌వెస్ట్‌ కనెక్టివిటీ, సుందరీకరణ, పరిరక్షణ పనులను జనవరి 2019లో ప్రారంభించి రెండున్నరేళ్లలోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మున్సిపల్‌ పరిపాలన శాఖ అధికారులు తెలిపారు. కాగా మూసీ సుందరీకరణ, పరిరక్షణ చర్యల్లో భాగంగా నది ప్రవాహ మార్గంలో నదిలోకి ఘన,ద్రవ వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలిచ్చామన్నాయి.

మూసీ కారిడార్‌ అభివృద్ధి పనులిలా..
పురానాపూల్‌–చాదర్‌ఘాట్‌ మార్గంలో 3 కి.మీ మార్గంలో మూసీ సుందరీకరణ, తీరైన ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లను తీర్చిదిద్దడం.
రివర్‌ఫ్రంట్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో మూసీ ప్రవహిస్తున్న 57 కి.మీ మార్గంలో దశలవారీగా సుందరీకరణ పనులు చేపట్టడం.

మరిన్ని వార్తలు