సర్పంచ్‌ పాలనే!

4 Jul, 2018 02:36 IST|Sakshi

సాధారణ ఎన్నికలయ్యే దాకా కొనసాగింపు.. యోచిస్తున్న రాష్ట్ర సర్కారు 

ఎన్నికల ముందు ఇదే ఉత్తమం అంటున్న అధికార పార్టీ నేతలు 

ప్రత్యేకాధికారులే మేలంటున్న అధికారులు 

నెలాఖరుకల్లా తేల్చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఇప్పుడున్న సర్పంచులు, గ్రామ పాలక వర్గాలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదే ఉత్తమ మార్గమని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యులను కొనసాగిస్తే పార్టీపై వారికి సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ప్రత్యేకాధికారులు లేదా పర్సన్‌ ఇన్‌చార్జీలకు బాధ్యతలను అప్పగించడమే మేలని అధికారులు గట్టిగా వాదిస్తున్నారు.

ఈ రెండు ప్రతిపాదనలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలకవర్గాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ల విషయంలోనూ ఇదే తరహాలో ముందుకెళ్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరుతో గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు పదవీకాలం పూర్తి కానుంది. ఆ లోగా పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేనే లేవు. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. దీంతో ఆగస్టు 1 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులకే గ్రామ పాలన పగ్గాలు అప్పగించడమా? ప్రత్యేక అధికారులను నియమించడమా అన్న అంశంపై ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది. 

ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేనట్టే! 
గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా చాలావరకు పూర్తి చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లు, బీసీల్లో ఏ, బీ, సీ, ఈ కేటగిరీ వంటి వాటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. బీసీ జనాభా, రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వం వాదించింది. అయితే మళ్లీ బీసీల గణన పూర్తి చేసి, జనాభా ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఎన్నికలకు కళ్లెం పడినట్టైంది. బీసీల గణన పూర్తయ్యేనాటికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బీసీ గణన, కులాల వారీగా లెక్కింపు పూర్తయి, రిజర్వేషన్లు కేటాయించే సరికి ఇంకొంత సమయం కావాల్సి ఉంటుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోపు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవచ్చని అటు అధికార పార్టీ నేతలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

పాలక వర్గాలనే కొనసాగిద్దాం.. 
ప్రజలు నేరుగా ఎన్నుకున్నందున ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక వర్గాలకే బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఎన్నికల ముందు పాలక వర్గాలకు వ్యతిరేకంగా, వారి మనసు నొప్పించేలా నిర్ణయాలను తీసుకోవడం సరికాదని వీరు అభిప్రాయపడుతున్నారు. అటు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కూడా తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.

సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలక వర్గాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకూ అలాగే ఎన్నికలయ్యే వరకు పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. అయితే అధికారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాలక వర్గాల పదవీకాలం పొడిగించడం వల్ల గ్రామస్థాయిలో రాజకీయాలు, వైషమ్యాలు, పంతాలు వంటి వాటితో అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని వాదిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా నిర్వహించుకోవడానికి అధికారులతోనే గ్రామ పరిపాలన నిర్వహించాలని కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, పరస్పర ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసుకోవచ్చునని వారు వాదిస్తున్నారు. 

రాజ్యాంగం ఏం చెబుతోంది? 
రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఐదేళ్ల లోపు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు లేవని రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాలను పొడిగించాలనుకున్నా, ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఈ విషయలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగపరంగా అవరోధాలేమీ ఉండవంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు