ఎకరానికి రూ. 5,000

2 Jun, 2019 01:25 IST|Sakshi

మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

ఈ–కుబేర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రైతు ఖాతాల్లో జమ

54.5 లక్షల మంది రైతులకు ఈ నెల 4, 5 తేదీల నుంచి అందజేత  

పట్టాదారు పాసుబుక్‌ రానివారు తమను సంప్రదించాలన్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : రైతుబంధు సాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రతి రైతుకూ ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం విడుదల చేశారు. గతేడాది సీజన్‌కు ప్రతి రైతుకూ ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర అందించింది. ఈ ఖరీఫ్‌ నుంచి దాన్ని రూ. 5 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ ఖరీఫ్‌ నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకూ అందించనున్నారు. ఇందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్‌బీఐకి చెందిన ఈ–కుబేర్‌ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం ఆన్‌లైన్‌లో జమ చేస్తామని పార్థసారథి వివరించారు.

పట్టాదారు పాసుపుస్తకంగల రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాగల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందించనుంది. రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు అందిన సమాచారం ప్రకారం 1.35 కోట్ల ఎకరాలకు చెందిన 54.50 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా ఆ ప్రకారం ప్రభుత్వం రూ. 6,750 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన రైతుల జాబితాలోని వారిలో కొందరు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించలేదు. ఒక అంచనా ప్రకారం వ్యవసాయశాఖ వద్ద కచ్చితంగా 50 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలున్నాయి. వారికి మాత్రమే రైతుబంధు సొమ్ము అందే అవకాశముంది. మిగిలినవారు కూడా తమ బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలని వ్యవసాయశాఖ వర్గాలు రైతులకు విన్నవించాయి. ఒకవేళ ఎవరికైనా అన్నీ క్లియర్‌గా ఉండి పట్టాదారు పాసుపుస్తకం మాత్రమే రాకపోతే, వారు కూడా తమను సంప్రదించాలని అధికారులు రైతులకు విన్నవిస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు సంబంధించిన రైతుబంధు సొమ్ము ఈ నెల 4, 5 తేదీల నుంచే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రెండు మూడు వారాల్లోగా ప్రతి రైతుకూ సొమ్ము చేరుతుందని వెల్లడించాయి. 

సాయం వద్దనుకుంటే వదులుకోవచ్చు... 
తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులెవరైనా ఉంటే వారు ‘గివ్‌ ఇట్‌ అప్‌’ఫారాన్ని మండల వ్యవసాయాధికారి లేదా మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలా మిగిలిన పెట్టుబడి సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందించనుంది. గివ్‌ ఇట్‌ అప్‌పై రైతుల్లో విరివిగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.
 
పీఎం–కిసాన్‌ సాయం కూడా... 
కేంద్ర ప్రభుత్వం పీఎం–కిసాన్‌ పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపజేస్తూ ఏటా రూ. 6 వేల చొప్పున సాయం అందించాలని శుక్రవారం నిర్ణయించింది. ఈ పథకం కింద తెలంగాణలోని రైతులకు రూ. 3,270 కోట్ల మేర వచ్చే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పథకాన్ని గత డిసెంబర్‌లో ఐదెకరాల లోపున్న రైతులకే కేంద్రం అమలు చేసింది. అప్పుడు తెలంగాణలో 25 లక్షల మందికి ఈ పథకం వర్తించింది. కానీ ప్రస్తుత ఏడాదిలో ఐదెకరాల పరిమితిని తొలగించి ఎంత భూమి ఉన్నా రైతులందరికీ రూ. 6 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు 54.50 లక్షల మంది ఉన్నారు. అయితే గతేడాది ఈ పథకం అమల్లో అనేక షరతులు విధించారు. ఇప్పుడు అవే షరతులు విధిస్తారా లేక రైతులందరికీ ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా