హరిత‘దైన్యం’

21 Feb, 2018 17:21 IST|Sakshi

మూడో విడత మొక్కకు దిక్కేది?

ఆర్భాటంగా హరితసైన్యం..

నెలలుగా జీతాలివ్వని వైనం

పర్యవేక్షణ పట్టని సైనికులు

నీళ్లు పోయబోమంటున్న ట్యాంకర్లు

అసలే వచ్చేది వేసవికాలంమొక్కల సంరక్షణపై యంత్రాంగం దిగులు 

సాక్షి, సిద్దిపేట: మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 492 మంది హరిత సైనికులను నియమించారు. సైకిళ్లను సైతం అందచేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను.. రోజూ మూడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరిగి పర్యవేక్షించాలి. మొక్క ఎదుగుదలను పరిశీలించడం, కలుపు తీసి కంచెవేయడం, పాదులు తీయడం, ట్రీగార్డుపెట్టడం, మొక్క చనిపోతే దాని స్థానంలో కొత్తది నాటడం.. వీరి విధులు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.194 చొప్పున ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారు.

ఉపాధి హామీ నిబంధన ప్రకారం ఒక జాబ్‌ కార్డుకు ఏడాదికి వంద రోజులే పని కల్పిస్తారు. హరిత సైనికులు నెలలో 24 రోజులు పనిచేసినా.. నాలుగు నెలల్లోనే అతని వంద రోజులు పని పూర్తవువుతుంది. దీంతో అతనికి డబ్బులు చెల్లింపునకు నిబంధనలు అడ్డు వస్తాయి. దీంతో అతని పనిదినాలు పూర్తయ్యాక మరొకరి కార్డుపై పనిచేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నిజమైన కార్డుదారునికి, హరిత సైనికుడికి మధ్య డబ్బుల విషయంలో ఘర్షణలు పరిపాటి అయ్యాయి.

నిజానికి ఒక సైనికుడు రోజూ 400 మొక్కలు పరిరక్షించాలి. కానీ, 800–1,000 మొక్కల పర్యవేక్షణ అతనికి అప్పగిస్తున్నారు. కూలీ మాత్రం 400 మొక్కలకే ఇస్తున్నారు. మిగిలిన మొక్కలు చూసినందుకు అదనపు డబ్బులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి హరితహారానికి కేటాయించిన డబ్బుల్లో రూ.2.5 కోట్లు బకాయిలు పడగా.. ఇందులో హరిత సైనికుల బకాయిలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. దీంతో పలువురు హరిత సైనికులు మొక్కల సంరక్షణను పట్టించుకోవడం లేదు.

‘నీళ్లొదిలిన’ ట్యాంకర్లు
హరిత సైనికుల సంగతిలా ఉంటే, జిల్లాలోని 399 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు 325 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. నీరు పోసినందుకు మొక్కకు 96 పైసలు చొప్పున ఇస్తారు. ప్రతీ మొక్కకు వారం, లేదా 10 రోజులకోసారి 10 లీటర్ల చొప్పున నీళ్లు పెట్టాలి. ఈ లెక్కన ట్యాంకర్‌కు ప్రభుత్వం రూ.384 చొప్పున లెక్కకట్టి చెల్లిస్తోంది. ట్యాంకరు సామర్థ్యం 5 వేల లీటర్లు. మొక్కలకు నీళ్లు పెట్టడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయని, కాబట్టి ట్యాంకర్‌కు రూ.480 చొప్పున ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని వీరంటున్నారు. పెరిగిన డీజిల్,  డ్రైవర్, కూలీ ఖర్చులతో రూ.384కి తాము నీళ్లు పోయలేమని అంటున్నారు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే పనిచేయలేమని తేల్చి చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడుకోవడం జిల్లా యంతాంగానికి సవాల్‌ కానుంది.  

ముంచుకొస్తున్న వేసవి
మూడో విడత హరితహారం కింద 2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ పరిధిలోని 105 నర్సరీల్లో 1.60 కోట్ల మొక్కలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని 43 నర్సరీల్లో 33 లక్షల టేకు మొక్కలు పెంచారు. మరికొన్ని మొక్కల్ని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రారంభంలో కురిసిన వర్షాలకు మొక్కలు నాటుకొని ఏపుగా పెరిగాయి. చలికాలంలోనూ వాటి పరిరక్షణ విజయవంతమైంది. నాటిన వాటిలో 90 శాతానికి పైగా బతికాయి. అసలైన సవాల్‌ ఇప్పుడే ఎదురైంది. ఒకపక్క హరిత సైనికులు, ఇంకోపక్క వాటర్‌ ట్యాంకర్ల యజమానుల సహాయ నిరాకరణ.. మరోపక్క ముదురుతున్న ఎండలు అధికారులను హడలెత్తిస్తున్నాయి. ఈ వేసవిలో మొక్కల సంరక్షణపై యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. 

పైసా ఇవ్వలేదు
నన్ను హరిత సైనికునిగా నియమించి, సైకిల్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైసా ఇవ్వలేదు. మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను రోజూ సంరక్షిస్తున్నా. మొక్కలకు దిక్కవుతున్న మాకు ఏ దిక్కూ లేకుండాపోయింది. పైసలు అసలిస్తరో యియ్యరో అర్థం కావట్లేదు. 
– అస్క స్వామి, హరిత సైనికుడు, మిరుదొడ్డి

రెండు నెలల జీతమే వచ్చింది
ఆరు నెలలుగా పనిచేస్తున్నా. రెండు నెలల జీతమే ఇచ్చిండ్రు. రోజుకు రూ.194 ఇస్తామని చెబితే సైకిల్‌పై తిరుగుతూ మొక్కలకు పాదులు తీసి నీళ్లు పోత్తన్న. ఉపాధి హామీలో వంద రోజులు నిండిపోయిన్నై. మిగతా జీతం ఎట్ల ఇత్తరో ఏమో? పనులు చేయాలని చెబుతున్నరు. పనైతే చేత్తన్న. జీతం రాకుంటే మండల ఆఫీసుల పోయి కూర్చుంట. ఈ పని చేయబట్టి మల్లా ఏ పనీ చేయరాకుండా కావట్టే. నెలనెలా జీతమిత్తె జర ఇల్లు గడుసు.
– గాలిపెల్లి శంకర్, పొట్లపల్లి

నీటి బిల్లులు ఇస్తలేరు
ప్రతి నెలా నాలుగైదుసార్లు మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నాం. ఒక్కో ట్రిప్పునకు రూ.500 చెల్లిస్తామని సార్లు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రూ.60 వేల బిల్లయ్యింది. నాకు రూ.23 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన పైసల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఇలా అయితే నీళ్లు బంద్‌ చేసుడే..
– తోట భూపాల్‌రెడ్డి, హరితహారం వాటర్‌ ట్యాంకర్‌ యజమాని, మిరుదొడ్డి

మొక్కల రక్షణకు ప్రణాళిక
హరితహారం 3వ విడత అవెన్యూ ప్లాంట్స్‌ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. హరిత సైనికుల, వాటర్‌ ట్యాంకర్‌ బకాయిలు త్వరలో చెల్లిస్తాం. పాదులు పెద్దగా ఉండటంతో నీళ్లు ఎక్కువ పడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి ట్యాంకర్ల వారికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం.
– స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

మరిన్ని వార్తలు