‘అసైన్డ్‌’  లెక్కేంటి?

8 Sep, 2019 02:03 IST|Sakshi

జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ లేఖ.. 3 రోజుల్లో వివరాలు పంపాలని ఆదేశం

8 విడతల్లో లెక్కలు తేల్చాలని సూచన

సామాజికవర్గాల వారీగా సమాచారం ఇవ్వాలని స్పష్టీకరణ

క్రమబద్ధీకరణ కోసమేనా అని రెవెన్యూ వర్గాల్లో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం వెలికితీస్తోంది. నిరుపేదలకు వివిధ దశల్లో కేటాయించిన భూముల వివరాలను రాబడుతోంది. 1954 నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల జాబితాను సేకరి స్తోంది. సామాజికవర్గాలవారీగా జరిగిన కేటాయింపుల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. పేదలు జీవనోపాధి పొందేం దుకు ఐదెకరాల్లోపు భూములను ప్రభుత్వం అసైన్‌మెంట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా చోట్ల ఈ భూములు చేతులు మారాయి. 

భూముల విలువలు గణనీయంగా పెరగడంతో పరాధీనమయ్యాయి. వాస్తవానికి అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. కానీ ఈ నిబంధనలను తోసిరాజని అనేకచోట్ల ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు కారుచౌకగా లభించే ఈ భూములను కొల్లగొట్టారు. ఒకవేళ అసైనీ (లబ్ధిదారు) చేతి నుంచి భూమి మారితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పని ఒత్తిడో లేక చేతివాటమో తెలియదు కానీ ఇలా పక్కదారి పట్టిన భూములను వెనక్కి తీసుకోవ డం నామమాత్రమే. 2005లో కాస్తోకూస్తో ఇలా చేతులు మారిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

గతేడాది అసైన్‌మెంట్‌ భూములు కొనుగోలు చేసిన వారికి కూడా వెసులుబాటు కల్పించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. భూమిలేని పేదలు ఈ భూములను కొంటే వారి పేరిట అసైన్‌ చేసేందుకు సర్కారు అంగీకరించింది. 1954 నుంచి గత నెల 31 వరకు జరిగిన భూ పంపిణీ సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో భూ కేటాయింపులు జరగ్గా ఎంత మంది లబ్ధిదారులకు ఎంత విస్తీర్ణంలో భూములు అసైన్‌ చేశారో నిర్దేశిత ఫార్మాట్‌లో మూడు రోజుల్లో పంపాలని స్పష్టం చేసింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతరులకు పంపిణీ చేసిన భూమి ఎంత? అయా భూముల్లో పోజిషన్‌లో ఉన్న లబ్ధిదారులు ఎందరు? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించిన విస్తీర్ణం ఎంత? ప్రజావసరాల కోసం సేకరించినది.. ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించినది, చట్టాన్ని ఉల్లంఘించడంతో వెనక్కి తీసుకున్న భూ విస్తీర్ణమెంతో లెక్క తేల్చాలని ఆదేశించింది. అలాగే అసైనీల అధీనంలో ఉన్న భూమి వివరాలను పంపాలని సూచించింది. ఈ లెక్కల అనంతరం అసైన్డ్‌ భూములపై స్పష్టత వస్తుందని తద్వారా ప్రభుత్వ భూముల వివరాలు కూడా తేలుతాయని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

ఐదెకరాల్లోపు క్రమబద్ధీకరణ?
అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదెకరాల్లోపు భూములను క్రమబద్ధీకరించే వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం..లబ్ధిదారులకు యాజమాన్య హక్కును కల్పించ వచ్చని భావిస్తున్నట్లు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పట్టాదార్‌ పాస్‌పుస్తకం జారీ చేయడం ద్వారా ఆ భూమిపై అప్పులు పొందడం సులభతరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు చేతులు మారిన భూములను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. ఆయా భూముల్లో పాగా వేసిన వారి పేరిట క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ కేటగిరీ భూములను మార్కెట్‌ రేటుకు అటుఇటుగా అమ్మే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్‌ భూముల లెక్క తేలాక గ్రేటర్, పట్టణ సంస్థల్లో ఇలాంటి భూముల్లో వెలిసిన కట్టడాలను కూడా క్రమబద్ధీకరించడం ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ ఈ ముసుగులో భూదందాలు జరిగితే నిలువరించడం కష్టమనే భావనతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా