కాళేశ్వరం టు పాలమూరు!

7 Mar, 2019 03:56 IST|Sakshi

బస్వాపూర్‌ రిజర్వాయర్‌నుంచి ఉద్దండాపూర్‌కు నీటిని తరలించేలా మరో ప్రణాళిక

ప్రాథమిక నివేదిక సిద్ధం   

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా  ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మరోకొత్త ప్రతిపాదనకు నాంది పలికింది. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న గోదావరి బేసిన్‌ నుంచి లభ్యత అంతం తమాత్రంగా ఉన్న కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించే ప్రణాళికను రూపొందిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న గోదా వరి నీటిని మరో  ఎత్తిపోతల పథకం పాల మూరు–రంగారెడ్డితో అనుసంధానించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ప్రాథమిక నివేదిక సిద్ధమైంది.  

పాలమూరుకు భరోసా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యమున్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి చేరుతున్న నీటిని పాలమూరులో భాగంగా జడ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు తరలించాలన్నది ప్రణాళిక. అయితే ఎంత నీటిని, ఎంత సామర్థ్యంతో తరలించాలన్న దానిపై ఇంకా స్పష్టత లేకున్నా, ఏ విధంగా నీటిని తరలించవచ్చన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ప్రణాళిక రూపొందించారు. నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. బస్వాపూర్‌నుంచి హై లెవల్‌ కెనాల్‌ద్వారా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు.

బస్వాపూర్‌ 490 మీటర్ల ఎత్తులో ఉండగా, తుమ్మలపల్లి 385 మీటర్ల ఎత్తున ఉండటంతో గ్రావిటీ ద్వారానే ఇక్కడికి నీటిని తరలించవచ్చు. ఇటు నుంచి 34 కి.మీ దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువుకు నీటిని తరలించాలంటే 155 మీటర్ల మేర లిఫ్ట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్రహీంపట్నంకు వచ్చే నీటిని 131 కి.మీల దూరంలో ఉన్న ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించాలంటే మధ్యలో 130 మీటర్ల మరో లిఫ్ట్‌ నిర్మాణం అవసరమవుతోంది. మొత్తంగా బస్వాపూర్‌ నుంచి ఉద్దండాపూర్‌కు 210 కిలోమీటర్లు నీటిని తరలించేందుకు సుమారుగా 280 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించాల్సి వస్తుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఈ నీటి తరలింపులో భాగంగా కాల్వలు శ్రీశైలం, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులను దాటి రావాల్సిఉంది. ఇక ఎంత సామర్థ్యం నీటిని బస్వాపూర్‌ నుంచి తరలించాలన్నది తేలలేదు.

ఇది తేలితేనే పంపులు, మోటార్ల సామర్థ్యం, వాటి సంఖ్య, కాల్వల డిశ్చార్జి సామర్ధ్యం ఎంతుండాలన్న స్పష్టత వస్తుంది. కనిష్టంగా బస్వాపూర్‌ నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని 120 రోజులపాటు తరలించగలిగినా, 21 టీఎంసీల నీటిని ఉద్దండాపూర్‌కు తరలించే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మాదిరి తరలింపు జరిగిన పక్షంలో కనిష్టంగా రూ.5వేల కోట్ల నుంచి రూ.6వేల కోట్లు ఖర్చయ్యే అవ కాశం ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి .  

ఉస్మాన్‌సాగర్‌పై ఇప్పటికే ప్రణాళిక
ఇక కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి, సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించే ప్రతిపాదన ఇదివరకే సిద్ధమైన విషయం తెలిసిందే. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్‌ వద్ద స్లూయిస్‌ నిర్మాణం చేసి, అటు నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు