7 వేల ఎకరాలు.. 90 రోజులు!

23 May, 2020 04:06 IST|Sakshi

ఫార్మాసిటీ భూసేకరణ వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

3 నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలని రెవెన్యూ శాఖకు ఆదేశం

ఇప్పటికే 7 వేల ఎకరాలు టీఎస్‌ఐఐసీకి బదలాయింపు..

సాక్షి, హైదరాబాద్‌: ఔషధనగరికి త్వరలోనే పునాదిరాయి పడనుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది చివరలో కార్యరూపం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండో విడత భూసేకరణకు 90 రోజుల గడువు విధించింది. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే.. ఫార్మాసిటీకి శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లాలో 19,333 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఔషధనగరి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతి, నిమ్జ్‌ హోదా లభించినా.. భూసేకరణలో జాప్యంతో ముందడుగు పడలేదు. ఇటీవల అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. త్వరలోనే దీనికి ముహూర్తం ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

తొలిదశలో 7,414 ఎకరాలు..!
రెండేళ్ల క్రితమే 7,414 ఎకరాల భూమిని సేకరించిన రెవెన్యూశాఖ.. ఫార్మాసిటీకి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్‌ఐఐసీకి బదలాయించింది. ఈ మేరకు తొలిదశ పనులు చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాజెక్టుకు 2018 చివర్లోనే అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా.. శాసనసభ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత భూసేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.

జంటనగరాల నుంచి కాలుష్య ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఫార్మాసిటీని కాలుష్య రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో అనేక కంపెనీలు అక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ఆసక్తి చూపాయి. బల్క్‌ డ్రగ్‌ మ్యానుఫాక్చరింగ్‌ అసోసియేషన్‌ ద్వారా ఇప్పటికే పలు పరిశ్రమలు ఔషధనగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి కూడా.. దీనికి తోడు ఫార్మా దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. కరోనా సంక్షోభంతో అనేక కంపెనీలు చైనాను వీడి.. భారత్‌ వైపు తరలిరావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

టైమ్‌లైన్‌ 90 రోజులు
ఈ నేపథ్యంలోనే రెండో విడత భూసేకరణను 90 రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో సింహభాగం ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. రెండో దశలో అధిక శాతం పట్టా భూములనే తీసుకుంటోంది. నష్ట పరిహారంపై స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, న్యాయపర చిక్కులు ఎదురవుతున్న కూడా వెనుకడుగు వేయకుండా.. కోర్డుల్లో పరిహారాన్ని జమ చేసి ముందుకు కదలాలని నిర్ణయించింది. 6,813.88 ఎకరాలను ఆగస్టు నాటికి సేకరించేందుకు గడువు పెట్టుకుంది. ఇందులో ఫార్మాసిటికీ గుండెకాయగా చెప్పుకుంటున్న ముచ్చర్ల, మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, పంజాగూడ గ్రామాల భూములున్నాయి.

తాజాగా భూసేకరణ జరిపే ప్రాంతాలివే..

మరిన్ని వార్తలు