ఇంకా కట్టెల పొయ్యిలే..

22 Nov, 2019 02:15 IST|Sakshi

దేశంలోని 15 రాష్ట్రాల్లో శుద్ధ ఇంధన వాడకంపై నీతిఆయోగ్‌ నివేదిక

అందులో 6 రాష్ట్రాల్లోని గ్రామాల్లో 33 శాతమే గ్యాస్‌ పొయ్యిల వాడకం

తెలంగాణలో గృహాల కన్నా ఎక్కువగా గ్యాస్‌ కనెక్షన్లు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యిల పైనే వంట చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం అధిగమించేందుకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలో ఉన్న హౌస్‌హోల్డ్స్‌కు పూర్తిస్థాయిలో ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో లోపాలు, శుద్ధ ఇంధన వాడకంపై అవగాహన కల్పించడంలో వెనుకబాటుతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వంటకు శుద్ధ ఇంధనాన్ని విని యోగిస్తున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలకు సంబంధించి శుద్ధ ఇంధన వాడకంపై నీతి ఆయోగ్‌ నివేదికను రూపొందించింది. ఇందులో ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 33% మాత్రమే ఎల్పీజీ సిలిం డర్ల ద్వారా వంట చేస్తున్నట్లు తేలింది.

దేశంలో ఉన్న శుద్ధ ఇంధన విని యోగంలో అధికంగా ఎల్పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్త రాది రాష్ట్రాలతో పాటు పట్టణ నేపథ్యమున్న దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులను పరి శీలిస్తూ వివరాలను నీతి ఆయోగ్‌ రిపోర్టులో పేర్కొంది. శుద్ధ ఇంధన వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది.

మూడింట ఒక వంతే..
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామాల్లోనే వంటచెరకు వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వాడుతున్నారు. కేవలం 33% మాత్రమే గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నారు. వంటచెరకు లభ్యత ఎక్కువగా ఉండటంతో వినియోగశాతం పెరిగినప్పటికీ.. క్రమంగా ఆ ప్రభావం పర్యావరణంపై పడుతోంది.

కొన్నిచోట్ల వంటచెరకుతో పాటు వంటచెరకు వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తున్నప్ప టికీ.. లబ్ధిదారులంతా వీటిని తక్కువ సందర్భా ల్లోనే వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో శుద్ధ ఇంధన వినియోగం సంతృప్తికరంగా ఉంది. దేశంలో శుద్ధ ఇంధన వినియోగంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గోవా, రెండో స్థానంలో పంజాబ్, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలున్నాయి.

రాష్ట్రంలో గృహాలకు మించి కనెక్షన్లు..
కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్‌ కనెక్షన్లు గృహాల సంఖ్యకు మించి ఉన్నాయి. రాష్ట్రంలో 91.46 లక్షల గృహాలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతుండగా.. అందులో 1.01 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గృహాల సంఖ్యకు మించి కనెక్షన్లున్నాయి. ఒక్కో గృహంలో ఒకటి, అంతకు మించి కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సరఫరా, అందుబాటులో ఉన్న డీలర్లు, నివాస ప్రాంతం మారడంతో కొత్త కనెక్షన్లు తీసుకోవడం లాంటి కారణాలతో కనెక్షన్లు పెరిగినట్లు తెలుస్తోంది.

విస్తృత అవగాహన కల్పించాలి..
శుద్ధ ఇంధన వినియోగాన్ని విస్తృతం చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరముందని నీతి అయోగ్‌ పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధ ఇంధన వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలి. అవసరమైనంత మేర ఎల్పీజీ సిలిండర్లు తక్కువ వ్యవధిలో సరఫరా చేసే వెసులుబాటు కల్పించాలి. విద్యుత్‌ సరఫరాకు వైర్లను వినియోగిస్తున్నట్లుగా గ్యాస్‌ సరఫరాకు పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలి..’అని సూచించింది. 

మరిన్ని వార్తలు