‘సాంఘిక సంక్షేమం’లో పాకెట్‌ మనీ.. 

5 Jul, 2019 12:23 IST|Sakshi
నగరంలోని బాలుర కళాశాల వసతిగృహం

ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.500

కళాశాల హాస్టల్‌ విద్యార్థులకు ఖర్చుల కోసం అందజేత

ఈ నెల నుంచే అమలు చేసేందుకు సిద్ధమవుతున్న అధికారులు

సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్‌: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ కళాశాల హాస్టల్‌ విద్యార్థులకు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం పాకెట్‌ మనీ అందించనుంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు వివిధ అవసరాల నిమిత్తం చేతిలో నగదు లేక.. ఇంటి వద్ద నుంచి పాకెట్‌ మనీ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు పాకెట్‌ మనీ కింద ప్రతినెలా రూ.500 అందజేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 11 ఎస్సీ కళాశాల హాస్టల్స్‌ కొనసాగుతున్నాయి. వీటిలో మొత్తం 1864 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ లబ్ధి జరగనుంది.

హాస్టళ్ల నిర్వహణ వ్యయం పెంపు.. 
పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్స్‌ నిర్వహణ వ్యయం కూడా పెంచాలని నిర్ణయించింది. గతంలో ఒక విద్యార్థికి రూ.4వేలు వెచ్చిస్తుండగా.. ప్రస్తుతం రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న బాలికలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పగలు, రాత్రి వేళల్లో వాచ్‌మన్‌లను నియమించనున్నారు. గతంలో ఒక వాచ్‌మన్‌ మాత్రమే పగటిపూట కాపలా ఉండేవాడని, ప్రసుత్తం 24 గంటలు హాస్టళ్ల వద్ద కాపాలా ఉండేందుకు వాచ్‌మన్‌లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు సైతం నిధులను ప్రతి సంవత్సరం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కళాశాల హాస్టళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

వార్షిక వేడుకలకు నిధులు.. 
పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్స్‌ విద్యార్థులు ప్రతీ సంవత్సరం వార్షిక వేడుకలను నిర్వహించుకునేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇక నుంచి ప్రతి ఏటా రూ.20వేలను మంజూరు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులటు కూడా జారీ చేసి ఆయా జిల్లా అధికారులకు జీవోలను జారీ చేసింది. ఈ నెల నుంచి వ్యక్తిగత ఖర్చుల కింద రూ.500 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుసుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులను ప్రోత్సహించేందుకే.. 
షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదువుపై ఏకాగ్రత పెంచేందుకు వారి ఖర్చులకు అవసరమైన పాకెట్‌ మనీ ఏర్పాటు చేసింది. డైరెక్టర్‌ కరుణాకర్‌ ఆదేశాల మేరకు వసతిగృహాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. పాకెట్‌ మనీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తాం. ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున అందిస్తాం.
– కస్తాల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి

మరిన్ని వార్తలు