అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా..  

3 Apr, 2020 03:35 IST|Sakshi

ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌  నేపథ్యంలో తప్పుడు వార్తలు, అసత్య సమాచారంతో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునేందు కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి ఇప్పటికే పలు చట్టాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ధ్రువీ కరణ తర్వాత మాత్రమే ప్రజలకు చేరవేయాలని అన్ని రకాల మీడియాను ఇదివరకే ఆదేశించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియ చెప్పేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనాలను ఈ వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు అందులోని వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. factcheck. telangana. gov.in వెబ్‌సైట్లో వాస్తవాలు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్న కొన్ని వీడియోలు, సమాచారంపై గురువారం బులెటిన్‌ విడుదల చేసింది.

►కొందరు ముస్లిం యువకులు స్పూన్లు, ప్లేట్లు నాకుతున్నట్లుగా ఉన్న ప్రచారంలో ఉన్న వీడియోలు 2018కి సంబంధించినవి. ఆహారం వృథా చేయకుండా బోహ్రా ముస్లిం తెగలో ఇది ఒక ఆచారం.
►కరోనాపై సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపేవారు శిక్షార్హులు అంటూ కేంద్ర హోం శాఖ పేరిట ప్రచారంలో ఉన్న లేఖ జారీ చేయడం అవాస్తవం.
►ఇటలీలో రోడ్ల మీద డబ్బును పడేస్తున్నారని ప్రచారంలో ఉన్న ఫోటోలు అవాస్తవం. వెనిజులాలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ పడిపోవడంతో అలా చేశారు.
►లాక్‌డౌన్‌ను మే 4వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించినట్లు స్క్రీన్‌షాట్‌ను ఫొటో షాప్‌లో చేశారు. ప్రధాని ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.
► కొంతమంది ముస్లిం యువకులు బృం దంగా ఏర్పడి తుమ్ముతున్నట్లుగా ప్రచారం లో ఉన్న వీడియోకు నిజాముద్దీన్‌ దర్గాకు ఎలాంటి సంబంధం లేదు. సూఫీ ఆచారం ప్రకారం ఇలా ఊగిపోవడాన్ని జిక్ర్‌ అంటారు.  పాకిస్తాన్‌లో జనవరిలోనే ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు