కష్టకాలం... కాపాడిన బాండ్ల వేలం 

25 Jun, 2020 01:40 IST|Sakshi

మూడు నెలల్లో రూ.12,500 కోట్లు సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం 

వరుసగా ప్రతి నెలా రూ. 4,000 కోట్లు బాండ్ల వేలం ద్వారానే... ఈ నెలలో రూ. 500 కోట్లు అధికం

ఆర్బీఐ షెడ్యూల్‌కంటే 3 నెలల్లో రూ.3,500 కోట్లు ఎక్కువ రాబడి

తెలంగాణ ఆర్థిక పరపతి కారణంగా వేలంలో పోటాపోటీగా బిడ్ల దాఖలు

ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఇంత మొత్తం బాండ్ల ద్వారా సమకూర్చుకోవడం ఇదే తొలిసారి

ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్లు, రైతుబంధు కోసం వినియోగించామంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా రూ. 12,500 కోట్లు సమకూర్చుకుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో 6 దఫాల్లో బాండ్లను వేలం వేసి ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని తెచ్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి స్థిరంగా ఉండడం, పెట్టుబడిదారులకు భరోసా కలగడంతో రాష్ట్ర బాండ్లను కొనుగోలు చేయడం కోసం పోటాపోటీ బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఆర్బీఐ షెడ్యూల్‌ ప్రకారం రావాల్సిన రూ.9 వేల కోట్ల కన్నా మరో రూ. 3,500 కోట్లు అదనంగా వచ్చాయని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ మొత్తం నిధులను ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్ల చెల్లింపులకు ఉపయోగించామని, కొంత మొత్తం రైతు బంధు కింద ఖర్చు చేశామని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు.  

కష్టకాలంలో... కలిసొచ్చింది 
వాస్తవానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన కరోనా వైరస్‌ ప్రభావం మన రాష్ట్ర ఖజానా మీద కూడా భారీగానే పడింది. పన్ను రాబడుల ద్వారా వేల కోట్ల రూపాయల్లో రావాల్సిన ఆదాయం ఏప్రిల్, మే నెలల్లో వందల కోట్లలో కూడా రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ సాయం, పన్నుల పంపిణీ, జీఎస్టీ పరిహారం లాంటి వాటిపైనే ఆధారపడి ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా భారీగా కోత పడడంతో ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో పేదలకు నగదు సాయం, ఆరోగ్య కార్యక్రమాల ఖర్చులు, బియ్యం పంపిణీ లాంటి కార్యక్రమాలు ఖజానాకు అదనపు భారంగా మారాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, ప్రభుత్వం ప్రతినెలా చేయాల్సిన అనివార్య చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలోని ఆర్థిక శాఖ బృందం ముందస్తు వ్యూహం, పక్కా క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా పకడ్బందీగా వ్యవహరించింది. ఈ పరిస్థితుల్లో బాండ్ల వేలం ద్వారా వచ్చిన రూ. 12,500 కోట్లు ఉపశమనం కలిగించాయి.

ప్రతినెలా రూ. 4వేల కోట్లు 
కరోనా కష్టకాలంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ తమ బాండ్లను వేలానికి పెట్టాయి. ఆర్బీఐ షెడ్యూల్‌ ప్రకారం మన రాష్ట్రం కూడా ఈ మూడు నెలల్లో రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లను వేలానికి పెట్టింది. కానీ, రాష్ట్ర ఆర్థిక పరపతికి అనుగుణంగా ఆర్బీఐ కూడా మరో రూ.3,500 కోట్ల విలువైన అదనపు బాండ్లను వేలం వేసేందుకు అంగీకరించి షెడ్యూల్‌లో చేర్చింది. దీంతో ఏప్రిల్‌ నెలలో రెండు దఫాల్లో రూ.4వేల కోట్లు, మేలో కూడా అదే తరహాలో రూ. 4వేల కోట్లు రాష్ట్రం సమకూర్చుకుంది. ఇక జూన్‌ 9న జరిగిన వేలంలో రూ. 2,461 కోట్లు, మంగళవారం మరో రూ. 2వేల కోట్లు వచ్చాయి. ఈ మొత్తం నిధులే కష్ట కాలంలో రాష్ట్ర ఆర్థిక బండిని గట్టెక్కించాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.  

మరిన్ని వార్తలు