ఊరూరా వన నర్సరీలు 

4 Apr, 2019 20:16 IST|Sakshi
దామరగిద్దలోని నర్సరీలో వేళ్లకు నీరు పడుతున్న కూలీ

వన్‌ విలేజ్‌  వన్‌ నర్సరీ నినాదంతో  15లక్షల మొక్కల పెంపకం 

సాక్షి, దామరగిద్ద: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంతో గ్రీన్‌విలేజ్‌ నిర్మాణానికి వన్‌ విలేజ్‌.. వన్‌ నర్సరీ నినాదంతో ఊరూరా ప్రారంభించిన నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభమైంది. మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో 30 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లిగుండం, కాన్‌కుర్తి, మొగుల్‌మడ్క, కంసాన్‌పల్లి, ముస్తాపేట్‌లో అటవీశాఖ ద్వారా 5నర్సీరీలు ఏర్పాటు చేయగా.. మిగిలిన అన్ని గ్రామాల్లో డ్వామా ద్వారా 25 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సీరీలో గ్రామ జనాభా, భౌగోళిక విస్తీర్ణం, రైతుల ఆసక్తిని పరిగణలోకి తీసుకొని 40వేల మొక్కల నుంచి లక్ష మొక్కలను పెంచుతున్నారు.  

40శాతం టేకు మొక్కలే.
మండలంలోని మొత్తం 30 నర్సీరీల్లో  15 లక్షల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో ప్రతి నర్సరీలో పెంచే మొక్కల్లో 40  శాతం టేకు మొక్కలు కాగా మిగిలిన 60 శాతం ఇంటి ముందు పరిసరాల్లో పెంచుకునే (హోంస్టేడ్‌) జామ నిమ్మ, అల్లనేరేడు, వంటి పండ్ల మొక్కలు కరవేపాకు, చింత, మామిడి తదితర మొక్కలకు పెంచుతున్నారు.  

నర్సరీలకు చేరిన 3.80 లక్షల టేకు వేళ్లు  
డ్వామా ద్వారా పెంచుతున్న రెండు నర్సరీల్లో టేకు మొక్కల పెంపకం ప్రారంభించారు. ఇప్పటివరకు మండలంలోని 17 గ్రామాల నర్సీరీలకు 3.80 లక్షల టేకు మొక్కలను సరఫరా చేయగా.. వాటిని మట్టి బ్యాగుల్లో నాటి పెంచుతున్నారు. జిల్లా అధికారుల నుంచి ఇప్పటివరకు అందిన టేకు మొక్కల వేళ్లు (స్టంప్స్‌) అందించగా పండ్ల మొక్కల పెంపకానికి విత్తనాలు సరఫరా కానున్నాయని అధికారులు అంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో 2.20 లక్షల స్టంఫ్స్‌ సరఫరా కానున్నాయని తెలియజేస్తున్నారు.

ఆయా నర్సరీల్లో 60శాతం పెంచే పండ్ల మొక్కల పెంపకానికి ప్రత్యేక పార్మేషన్‌ బెడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి పరిసరాల్లో పెంచే మొక్కల పెంపకానికి మట్టి గులికలతోపాటు ఎం45, ఎస్‌ఎస్‌పీ, ఒక్కో మీటర్‌ పొడవు వెడల్పు మట్టిబెడ్‌లను ఏర్పాటు చేసి వాటిలో విత్తనాలు చల్లి మొక్కలను పెంచనున్నారు. మొలకలు రాగానే వాటిని మట్టితో నింపిన ప్లాస్టిక్‌ బ్యాగులలో నాటి పెద్ద చేస్తారు. ప్రతి విలేజ్‌ను గ్రీన్‌విలేజ్‌ మార్చేందుకు నెల క్రితమే నర్సరీల్లో మట్టి బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పూర్తిచేసి సిద్ధంగా ఉంచారు.  

వన నర్సరీల ఏర్పాటుకు మూడు నెలల నుంచి కరసత్తు ప్రారంభించాం. అన్ని నర్సరీల్లో ఫిడస్ట్రాల్‌ ట్యాంకుల నిర్మాణం, మట్లి బ్యాగ్‌ల ఫిల్లింగ్‌ పూర్తయింది. 17 నర్సరీల్లో ఇప్పటి వరకు పంపిణీ చేసిన 3.80 టేకు స్టంప్స్‌ నాటి వాటని పెంచుతున్నాం. మరో 2.20 టేకు స్టంఫ్స్‌  పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలో టేకుతో పాటు మొత్తం 15 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నర్సరీలు కొనసాగుతున్నాయి. 
– సందీప్‌కుమార్, ఎంపీడీఓ, దామరగిద్ద
        

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా