ఉద్యోగుల పదవీ విరమణ @ 60

20 Jun, 2020 01:14 IST|Sakshi

రెండేళ్ల పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు

ఏపీ,కర్ణాటక తదితర రాష్ట్రాల తరహాలో అమలుకు యోచన

వేతన సవరణ సంఘం సిఫారసు కూడా అదే!

అమలు చేస్తే సర్కారుకు ఏటా రూ. 3,500 కోట్లు ఆదా  

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పొడిగించడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పదవీ విరమణ విషయంలో వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన సర్కారు.. ఇక్కడ కూడా అదే పద్ధతిని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, గుజరాత్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే విధానం అమలులో ఉన్నందున.. ఇక్కడ కూడా రిటైర్మెంట్‌ను 60 ఏళ్లకు పొడిగించాలని భావిస్తోంది. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రిటైర్మెం ట్‌కు దగ్గరగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణ యం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

60 ఏళ్ల రిటైర్మెంట్‌కే పీఆర్‌సీ మొగ్గు!
వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) కూడా ఉద్యో గుల పదవీ విరమణ వయసు పొడిగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లు చేసినం దున.. తెలంగాణలోనూ పొడిగించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించనుందని సమాచారం. ఉద్యోగుల వయోపరిమితిని గణ నీయంగా సడలించినందున.. సర్వీసులో చేరిన కొన్నేళ్లకే పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుం బానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకొని మరో రెండేళ్లు పొడిగిస్తే బాగుంటుందని పీఆర్‌సీ తన నివేదికలో అభిప్రాయపడ్డట్లు తెలిసింది. మరోవైపు రాబోయే రెండు, మూడేళ్లలో సర్కారు కొలు వులు భారీగా ఖాళీ కానున్నాయి. ఇప్ప టికే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ సంవత్సరంలో 8,600 మంది, 2021లో8,200, 2022లో9,200 మంది ఉద్యోగులు రిటైర్‌ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. వీటిని ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి కూడా కనిపించ నందున పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ. 3,500 కోట్లు ఆదా!
ప్రభుత్వ ఉద్యోగి రిటైర్‌ అయితే సగటున రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. ఈ నేపథ్యంలో రిటైరైన ఉద్యోగులకు ఏడాదికి రూ. 3,500 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి పంజా విసరడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వైరస్‌ పీడ ఇప్పట్లో విరుగుడయ్యే సూచనలు కనిపించడంలేదు. దీంతో గత మూడు నెలలుగా సగం జీతం కోత పెడుతున్న సర్కారుకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడం గుదిబండగా మారనుంది. ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాల్లేవు. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు కరోనా ప్రభావం ఎంతోకొంత ఉంటుందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పదవీ విరమణ వయసు పొడిగిస్తే తాత్కాలికంగా రూ. 3,500 కోట్లు పొదుపు అవుతాయని, ఇదే క్రమం కొనసాగుతుంది కనుక ఈ రూ.3,500 కోట్ల ఆదా శాశ్వతంగా ప్రభుత్వానికి ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచే అవకాశాలున్నాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.

సర్వీసు వివాదాలకు చెక్‌ పెట్టేందుకు కమిషన్‌
ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న లిటిగేషన్‌ సమస్యను పరిష్కరించేందుకు, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి శాఖలో రిటైరైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా సూపరింటెండెంట్‌ ఇంజనీర్లుగా పరిగణించాల్సి రావడం, ఈ కేసు తేలడానికి 20 ఏళ్లకుపైగా పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో సర్వీసు వ్యవహారాలపై వచ్చే లిటిగేషన్లను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందుకోసం గ్రీవెన్స్‌ రీడ్రెసల్‌ కమిషన్‌ (జీఆర్‌సీ) తరహాలో ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్‌ అధికారులతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.

ప్రభుత్వం తీసుకొనే సర్వీసు నిర్ణయాల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా వాటిని సంబంధిత శాఖ పరిష్కరించనుంది. అలా పరిష్కారం కాని పక్షంలో ఆ కేసులను కమిషన్‌కు సిఫారసు చేసే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు కమిషన్‌ ఆ కేసును స్వీకరించి భేదాభిప్రాయాలున్న ఉద్యోగులు, ఉద్యోగ సమూహాలు లేదా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే మళ్లీ తిరిగి దాన్ని కమిషన్‌కు పంపవచ్చు. అప్పుడు మళ్లీ కమిషన్‌ ఈ కేసును పరిశీలించి అదే నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తే అందరూ కమిషన్‌ నిర్ణయానికి కట్టుబడాల్సిందే.  

మరిన్ని వార్తలు